మొత్తానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్ట్ చేసింది. 2013-16 కాలంలో ఎన్ఎస్ఈ సీఈవోగా ఉన్న చిత్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆమె వైఖరి వల్ల స్టాక్ ఎక్స్చేంజిలో పెట్టుబడులు పెట్టిన వేలాదిమంది ఇన్వెస్టర్లు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. సీఈవోగా తనను ఒక అదృశ్య వ్యక్తి, హిమాలాయాల్లో సంచరించే ఒక బాబా నడిపించారనే విచిత్రమైన వాదన చిత్ర వినిపిస్తున్నారు.
లక్షల కోట్ల రూపాయల టర్నోవర్, బిజినెస్ జరిగే స్టాక్ ఎక్స్చేంజ్ రోజువారి కార్యక్రమాలను అత్యున్నత స్థాయిలో ఉన్న సీఈవోను ఒక అదృశ్య వ్యక్తో లేదా హిమాలయాల్లో సంచరించే బాబానో నడిపించారంటే ఎవరైనా నమ్ముతారా ? అసలు హిమాలయాల్లో సంచరించే బాబాకు లక్షల కోట్ల రూపాయల వ్యవహారాలతో ముడిపడున్న స్టాక్ ఎక్స్చేంజికి ఏమిటి సంబంధమో చిత్ర చెప్పటంలేదు.
జరిగిన విషయాలపై చిత్ర చెబుతున్న విషయాలను విన్న తర్వాత ఆర్థిక రంగ నిపుణులు, స్టాక్ ఎక్స్చేంజ్ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. చిత్రాను సీబీఐ అదుపులోకి తీసుకుని ఎన్ని రోజులు విచారించినా ఉపయోగం లేకపోయింది. సీబీఐ విచారణకు ఆమె ఏమాత్రం సహకరించలేదు. ఆమెను విచారించే క్రమంలో సీబీఐ కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ సీనియర్ సైకాలజిస్టు సహాయం తీసుకున్నా ఉపయోగం లేకపోయింది. ఏ రకంగా విచారించినా చిత్ర సహకరించలేదు.
సీబీఐ అదుపులో ఉన్నపుడే చిత్ర దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. తమ విచారణలో సహకరించని కారణంగా సీబీఐ చిత్రను అరెస్టు చేసింది. ఈమె సీఈవోగా ఉన్న కాలంలో వెనకుండి నడిపించింది గ్రూపు ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన ఆనంద్ సుబ్రమణియన్ అని దాదాపు తేలిపోయింది. అదృశ్య వ్యక్తి కానీ హిమాలయ బాబా కానీ లేరని ఆనందే బాబా పేరుతో చిత్రను కీలుబొమ్మను చేసి ఆడించినట్లు సీబీఐ అనుమానిస్తోంది.
తమ అనుమానాలకు తగిన ఆధారాలను సీబీఐ ఇఫ్పటికే సేకరించినట్లు సమాచారం. చిత్రతో పాటు ఆనంద్ సుబ్రమణియన్ ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అయితే ఆనంద్ కూడా సీబీఐకి సహకరించటం లేదు. సరే ఈరోజు కాకపోయినా వీళ్ళద్దరు సీబీఐ విచారణలో మొత్తం గుట్టును విప్పకతప్పదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇదే చిత్ర ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో ప్రముఖంగా చెప్పటం. అంతర్జాతీయ స్ధాయిలో అంత్యంత ప్రభావశీలుర మహిళల జాబితాలో చిత్రకు కూడా ఉన్నారు. పదవుల్లో నుండి దిగిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళంతా వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోవటమే ఆశ్చర్యంగా ఉంది.