మెగాస్టార్ చిరంజీవి అలియాస్ చిరు చాలా ఏళ్ల తర్వాత మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో టాక్ ఆఫ్‌ది లీడర్‌గా మారారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, గాజువాక నుంచి బరిలో ఉన్న పంచకర్ల రమేష్‌బాబులతో ఆయన భేటీ అనంతరం.. మరింతగా రాజకీయాల్లో చిరు వ్యవహారం ఆసక్తిగా మారింది. దీనిపై వైసీపీ నుంచి విమర్శలు, ఇటువైపు నుంచి ప్రతి విమర్శలు కూడా వచ్చాయి. కట్ చేస్తే.. చిరు కేంద్రంగా ఆయన ఇంకా ప్రచారంలోకి అడుగు పెట్టకముందే.. పొలిటికల్ వార్ నడుస్తోంది.
ఇక, చిరంజీవి కనుక.. తన సోదరుడి పార్టీకి సేవ చేసేందుకు ముందుకు వస్తే.. ఏం జరుగుతుంది? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయాన్ని గమనిస్తే.. ప్రస్తుతం చిరు ఎంపీగా లేరు. తాను ఏ పార్టీలో ఉన్నదీ ఆయన చెప్పడం లేదు. లేరనే అంటున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఆయనను తన వాడిగానే ప్రచారం చేస్తోంది. కానీ, చిరు నుంచి స్పందన రాలేదు. ఇదిలావుంటే. చిరు రాజకీయాల్లోకి వచ్చి.. పవన్ తరఫున ప్రచారం చేస్తారని అంటున్నారు. పిఠాపురంలో పవన్‌ను గెలిపించాలనే లక్ష్యంతో చిరు వచ్చే అవకాశం ఉంది.
ఎదురయ్యే సమస్యలు ఇవే!
చిరంజీవి రాజకీయాలకు దూరమై.. దాదాపు పదేళ్లు అయిపోయింది. రాష్ట్ర విభజన నుంచి నేటి ఏపీ సమ స్యల వరకు కూడా ఆయన ఏనాడూ స్పందించలేదు. పైగా.. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెబుతున్న నేపథ్యంలో బీజేపీ కూటమి పక్షాన ఆయన ప్రచారం చేయడం కూడా.. ఇబ్బందిగానే మారుతుంది. అదేసయమంలో జగన్ తెచ్చిన మూడు రాజధానులకు చిరు గతంలో మద్దతు తెలిపారు. విశాఖను రాజధానిగా స్వాగతిస్తున్నానని చెప్పారు.
మరోవైపు కూటమి పార్టీలు అమరావతికే మద్దతు తెలిపాయి. వీటితోపాటు.. అసలు తాను తన పార్టీ ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేయాల్సి వచ్చిందో కూడా ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి ఎదురు కానుంది. అలా కాదు.. నేను ఏ ప్రశ్నకు సమాధానం చెప్పను.. నేను చెప్పిందే వినాలని అంటారా? చూడాలి!