రాజకీయాల్లో తన వైఫల్యం గురించి ఈ మధ్య చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తాను రాజకీయాలకు సరిపడనని.. అందులో ఇమడలేక బయటికి వచ్చేశానని అంగీకరిస్తూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చాలా దృఢమైన వ్యక్తి అని, అతను రాజకీయాల్లో బలంగా నిలబడగలడని, ఉన్నత స్థాయికి ఎదగగలడని చిరు ఇంతకుముందే ఒకట్రెండు సందర్భాల్లో చెప్పారు.
తాజాగా మరోసారి చిరంజీవి రాజకీయాల్లో తనకు, తన తమ్ముడికి ఉన్న వైరుధ్యం గురించి ఒక కార్యక్రమంలో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి మనస్ఫూర్తిగా వెళ్లలేదని, అక్కడ ఇమడలేక బయటికి వచ్చానని చిరు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
నేను జీవితంలో అనుకున్నవి అన్నీ చేశాను. సాధించాను. కానీ ఒక్కటి మినహా. నా మనసులోంచి రాకపోతే అందులో నేను దాని అంతు చూడలేను. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకందరికీ తెలుసు. దాని గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అందుకే నేను అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాను.
ఎందుకంటే అక్కడ రాణించడం చాలా కష్టం. మనం సున్నితంగా ఉండకూడదు. అందులో బాగా మొరటుగా ఉండాలి. రాటుదేలాలి. మాటలు అవసరమైనా కాకపోయినా అనిపించుకోవాలి. అనాలి. అవసరమా ఇది? తను (పవన్ కళ్యాణ్) తగిన వాడు. తను అంటాడు. అనిపించుకుంటాడు. అలాంటివాళ్లకు మీరందరూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులతో ఏదో ఒక రోజు కచ్చితంగా మనం చూస్తాం అత్యున్నత స్థానంలో అంటూ పవన్‌ను ఉద్దేశించి చిరు వ్యాఖ్యానించాడు.
మొత్తానికి ఏపీ సీఎం జగన్ సహా అందరితోనూ చిరు సన్నిహితంగానే మెలిగినా.. రాజకీయంగా ఆయన మద్దతు మాత్రం తన తమ్ముడికే అని ఈ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టం అయింది.
Annayya #Chiranjeevi about Politics
And Support for @PawanKalyan garu
Boss @KChiruTweets #PawanKalyan#MegastarChiranjeevi #WaltairVeerayya pic.twitter.com/iBlazDFyXV— Chiranjeevi Army (@chiranjeeviarmy) November 20, 2022