క్యాసినో కింగ్‌గా చెప్పుకుని చీకోటి ప్రవీణ్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా?
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన బీజేపీలో చేరబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
ప్రవీణ్ త్వరలోనే కాషాయ కండువా కప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌తో కలిసి దిల్లీ వెళ్లిన ప్రవీణ్. . అక్కడ డీకే అరుణతోనూ సమావేశమవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది.
తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా భారీగా నేతలను చేర్చుకుంటోంది. ఎవరు వస్తామన్నా కాదనకుండా కాషాయ కండువా కప్పుతోంది. ఇప్పుడీ క్రమంలోనే ప్రవీణ్‌ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై బండి సంజయ్‌తో ప్రవీణ్ చర్చించినట్లు తెలిసింది. అయితే ప్రవీణ్ చేరికపై బండి సంజయ్ స్పష్టమైన హామీ ఇవ్వలేనట్లు సమాచారం. కేసులు ఎదుర్కొంటున్న ఆయన్ని.. పార్టీలోకి చేర్చుకునే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ప్రవీణ్ ప్రధాన నిందితుడు. ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు. విదేశాల్లోనూ పట్టుబడ్డారు. ఇటీవల బోనాల పండగ సందర్భంగా ప్రైవేట్ గన్మెన్లతో లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయానికి వెళ్లడం కలకలం రేపింది. దీనిపైనా అతనిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కేసుల నుంచి రక్షణ కోసమే ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌లో ఓ చోటు నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.