గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పొందాలపై మాజీ మంత్రి, జగన్ కు అత్యంత సన్నిహితు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ కేబినెట్లో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాలినేని ఇటీవల మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తాను సంతకం చేయలేదని, అర్థరాత్రి నిద్ర లేపి మరీ ఫైల్ పై సంతకాలు పెట్టమని ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. అనుమానంతో తాను సంతకం చేయకపోవడంతో.. కేబినెట్ లో పెట్టి విద్యుత్ ఒప్పందాలను ఆమోదించుకున్నారంటూ బాలినేని చేసిన విమర్శలు పెను దుమారం రేపుతున్నాయి.
అయితే ఈ విమర్శలపై తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పందిస్తూ.. బాలినేనికి గట్టిగా చురకలు అంటించారు. అబద్ధాలు కూడా బాలినేని చాలా గొప్పగా చెబుతున్నారని చెవిరెడ్డి సెటైర్లు వేశారు. కొత్త పార్టీ మెప్పు పొందడానికే బాలినేని ఈ విధంగా మాట్లాడుతున్నారని.. కానీ మరీ ఇంత దిగజారిపోతారని ఊహించలేదంటూ చెవిరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ సీటు కోసం బాలినేని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని ఇప్పటికే చెప్పుకుంటున్నారని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ కు రూ. 4.50తో విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే.. జగన్ సీఎం అయ్యాక రూ. 2.48కి తగ్గించారని ఈ సందర్భంగా చెవిరెడ్డి గుర్తుచేశారు. జగన్ మీద అబాండాలు వేసి లబ్ధి పొందాలనుకుంటే.. అది బాలినేనికే రివర్స్ అవుతుందని హెచ్చరించారు. అర్థరాత్రి సంతకం పెట్టమని ఒత్తిడి తెచ్చారని బాలనేని చెప్పడం బాధాకరమన్నారు. కేబినెట్ మీటింగ్ లో కొన్ని అంశాలు టేబుల్ అజెండాగా వస్తాయని.. సభ్యుల ఆమోదంతో తీర్మానం అవుతాయని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో తనకు స్వేచ్ఛ లేదన్నారు.. కానీ చార్టెడ్ ఫ్లైట్లో ఇతర పార్టీల నేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఉండటం నిజం కాదా? అంటూ బాలినేనిని చెవిరెడ్డి ప్రశ్నించారు.