కొద్ది రోజుల క్రితం టీడీపీలోని కొందరు సీనియర్ నాయకులు అసమ్మతి స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని, పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తమకు తగిన గుర్తింపునివ్వడం లేదని కొందరు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. ఆ తర్వాత వారిని చంద్రబాబు బుజ్జగించడంతో వ్యవహారం సద్దుమణిగింది. ఈ క్రమంలోనే తాజాగా అమరావతిలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా పార్టీలోని సీనియర్లపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఓట్లు వేయించలేని సీనియారిటీతో ప్రయోజనమేమిటని, ఓట్లు వేయించలేని సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ పోతే ఇకపై ప్రతిపక్షంలోనే ఉంటామని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లను యువతకు ఇవ్వాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే యువనేతలను గుర్తిస్తామని, వారికీ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పని చేయకుండా, పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ మాయ చేసే నాయకులకు చెక్ పెడతామని హెచ్చరించారు.
వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు అందరూ కలసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. భయపడితే కోలుకోలేని విధంగా దెబ్బతింటామని, ప్రతి ఒక్కరూ పోరాటాన్ని ఆయుధంగా మలచుకోవాలని అన్నారు. అందరికీ తాను అండగా ఉంటానని, సమాజానికి తెలుగుదేశం అవసరం ఉందని, సమాజ హితం కోసం విరాళాలను సేకరిస్తున్నామని తెలిపారు. విరాళాలు వస్తే కొందరికైనా సాయం చేయవచ్చని అన్నారు.