మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు స్కిల్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు 35 రోజులకు పైనే ఆయన జైల్లో ఉన్నారు. గడిచిన మూడు నాలుగు రోజలుగా ఆయన ఆరోగ్యంపై వార్తలు రావటం.. ఆందోళనలు అంతకంతకూ పెరగటం తెలిసిందే. నిజంగానే.. ఆయన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారా? ఆయనకున్న ఆరోగ్య సమస్య ఏంటి? తాజా పరిణామాలు ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయా? లాంటి సందేహాలు పలువురిని వేధిస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇంతకూ ఆయనకున్న చర్మ సంబంధిత సమస్య ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆయన సొరియాసిస్ తో బాధ పడుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి చంద్రబాబుకు ఆ సమస్య ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు.. అలెర్జీ స్థాయి పెరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకునే వారు. కానీ.. జైల్లో అలాంటి పరిస్థితులు ఉండవన్న సంగతి తెలిసిందే.
దీనికి తోడు జైల్లో నెలకు పైనే ఉండటం.. చంద్రబాబు వయసుకు.. ఆయన శరీరం అలవాటు పడిన సౌకర్యాలకు భిన్నంగా జైలు జీవితం ఉండటంతో.. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఖాయం. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. దీనికి తోడు.. చర్మ సంబంధిత వ్యాధులు ఎదురైనప్పుడు.. తగిన ట్రీట్ మెంట్ లభించని పక్షంలో.. దాని తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతుంటుంది. చంద్రబాబుకున్న సమస్యను చూస్తే.. ఆయనకు వేడి వాతావరణం.. చెమట పట్టటం లాంటివి అసలే ఉండకూడదు. కానీ.. జైల్లో అలాంటి పరిస్థితి ఉండదన్న సంగతి తెలిసిందే.
ఈ కారణంగా ఆయన చర్మం మీద దద్దుర్లు పెద్ద ఎత్తున వ్యాపించాయి. 78 ఏళ్ల వయసులో చర్మ సంబంధిత వ్యాధి.. దీనికి తోడు విపరీతమైన దురద.. ఇది సరిపోదన్నట్లు వేడి వాతావరణం లాంటివి సామాన్యులకు కొంత ఇబ్బంది ఉంటే.. చంద్రబాబు లాంటి వీఐపీకి తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితిగా చెప్పొచ్చు. ఒంటి మీద దురద వస్తే ఎంత చికాకుగా ఉంటుందో అందరికి తెలిసిందే. అలాంటిది ఒంట్లోని చాలా భాగాల్లో దురద ఉంటే అదెంత నరకమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సొరియాసిస్ కారణంగా ప్రాణాలు పోతాయా? అంటే పోవనే చెప్పాలి. కానీ.. రోజు వారీ జీవితం ఏ మాత్రం బాగోదు. చెమట.. ఉక్కపోత కారణంగా ఒంటి మీద దద్దుర్లు అంతకంతకూ పెరగటం.. విపరీతమైన దురద కారణంగా దేని పైనా మనసు లగ్నం చేయలేని పరిస్థితి ఉంటుంది. అన్నింటికి మించి.. పొక్కులు చిట్లి.. చుట్టుపక్కల వ్యాపించటం ద్వారా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు పోవు కానీ.. స్థైర్యం తగ్గేలా చేస్తుందని చెప్పక తప్పదు. ఇప్పుడిలా ఉంటే.. తర్వాతి రోజుల్లో ఇప్పుడుమొదలైన ఆరోగ్య సమస్య తీవ్ర రూపం దాల్చేందుకు మాత్రం ఛాన్సు ఇచ్చినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.