నిత్యం వైసీపీ పైనా, సీఎం జగన్ పైనా విమర్శలు గుప్పించే చంద్రబాబు ఇలా బేలగా సీఎం జగన్ను అర్ధిస్తున్నారేంటని అనుకుంటున్నారా? ఇది నిజమైన అర్ధింపు కాదు.. సటైర్.
ఔను.. నిజమే కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు సీఎం జగన్ను ఉద్దేశించి సటైర్లపై సటైర్లు వేశారు.
తన సొంత నియోకవర్గంలో నీరు పారిస్తున్నట్టు సీఎం జగన్ ఇటీవల హడావుడి చేశారని, ఆ నీళ్లు ఎక్కడ పారుతున్నాయో.. చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలో సటైర్లతో సీఎం జగన్పై విరుచుకుపడ్డారు.
“అదిగదిగో హంద్రీనీవా.. ఇదిగిదిగో నీరు.. లేవండి లేవండి లేవండి..ఎక్కడి వాళ్లు అక్కడ సర్దు కోండి.
జగన్ పారించిన నీళ్లు కుప్పాన్ని ముంచెత్తుతున్నాయి.
ఎక్కడ చూసినా.. చెరువులే కనిపిస్తున్నాయి. ఈ నీళ్ల తాకిడికి కుప్పంలోని లోతట్టు ప్రాంతా లు మునిగిపోయే ప్రమాదం ఉంది.
సీఎం జగన్.. త్వరగా రా.. హెలికాప్టర్లో వచ్చి.. నువ్వు పారించిన హంద్రీనీవా నీటిలో ముని గిపోతున్న మమ్మల్ని, మా ప్రజలను రక్షించు.
మా జీవితాలు కాపాడు ప్లీజ్!“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దీంతో సభలో ఒక్క పెట్టున ప్రజలు ఘొల్లున నవ్వుకున్నారు.
ఇక, సీఎం జగన్పై తనదైన శైలిలో చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
హంద్రీనీవా నీళ్లు అంటూ జగన్ డ్రామాలు ఆడారని అన్నారు.
సినిమా సెట్టింగులతో ఇక్కడ మోసాలు చేశాడని విమర్శించారు.
ముస్లింలకు అండగా ఉంటా!
రంజాన్ మాసం నేపథ్యంలో… కుప్పంలోని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో చంద్రబాబు పాల్గొన్నారు.
అనంతరం ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ముస్లింల భద్రతకు తాను బాధ్యత తీసుకుంటానని అన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరం అని, పొత్తు వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు.
ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలను తాము ఏనాడూ తీసుకోలేదని చంద్రబాబు చెప్పారు.
“ముస్లింలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ.
40 ఏళ్లుగా ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
ఉర్దూను రెండో భాషగా చేసింది టీడీపీనే.
సమైక్య రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేశాను.
ముస్లింలో చాలా మంది పేదలు ఉన్నారని గుర్తించిన ఎన్టీఆర్ 1985లో దేశంలోనే మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారు.
హజ్ యాత్రకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని… హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టి విమాన సదుపాయాన్ని కల్పించాం.
రాష్ట్రం విడిపోయాక కడప, విజయవాడలో హజ్ హౌస్ ల నిర్మాణం చేపట్టి 90 శాతం పూర్తి చేశాం.
కానీ వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు“ అని చంద్రబాబు అన్నారు.