ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు.. వాట్సాప్.. సోషల్ మీడియాలో ప్రచారం. కట్ చేస్తే.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘సైబర్ టవర్స్ రజతోత్సవ’ కార్యక్రమం చంద్రబాబు కు సెల్యూట్ చేయటమే కాదు.. యాభై రోజులకు పైగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్న వైనంపై గళం విప్పింది. స్టేడియంకు వచ్చిన వారిలో అత్యధికులు 30 ఏళ్లలోపు వారే కావటం ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భంగా పెల్లుబుకిన అభిమానం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసింది.
పెద్ద అంచనాలు లేని ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది ఒక ఎత్తు అయితే.. ఒక కాన్సర్ట్ కు ఎలా అయితే వెళతారో.. అలాంటి సమూహం గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారంసాయంత్రం కనిపించింది. వారంతా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తామని.. సంఘీభావాన్ని ప్రకటించటంతో పాటు.. ఆయన విజన్ వల్లే తాము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకున్న వైనం చూసినప్పుడు.. చంద్రబాబు ఇమేజ్ మరో ఎత్తుకు తీసుకెళ్లేలా చేసిందని చెప్పాలి.
రాజకీయాలు మాట్లాడటం.. రాజకీయాలు మాట్లాడే వేదిక కాదంటూ ఈ ప్రోగ్రాంను నిర్వహించిన నిర్వాహకులు.. ప్రత్యర్థులపై విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభలో మాట్లాడిన వక్తలు అక్కడక్కడా కాసింత ఆవేశానికి.. తీవ్రమైన భావోద్వేగానికి గురైనప్పటికీ.. తొందరపాటుకు మాత్రం పోలేదు. పేర్లు తీసుకొచ్చి విమర్శలు చేయలేదు. ఈ విషయంలో సంయమనాన్ని పాటించటం కనిపించింది. వేలాది ఐటీ ఉద్యోగులు.. చంద్రబాబు జై.. సీబీఎన్ జిందాబాద్.. మేము సైతం బాబు కోసం లాంటి స్లోగన్లు పెద్ద ఎత్తున వినిపించాయి.
హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ను నిర్మించి పాతికేళ్లు అవుతున్న వేళ.. ఐటీ రంగానికి బీజం వేసిన చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ పేరుతో నిర్వహించిన సంగీత విభావరి.. ఈ సందర్భంగా పలువురు మాట్లాడినమాటలు.. చేసిన ప్రసంగాలు చంద్రబాబు ఇమేజ్ ను సరికొత్త శిఖరాలుకు తీసుకెళ్లేలా చేశాయని చెబుతున్నారు. పెద్ద వయస్కులు.. చంటి పిల్లల్నితీసుకొని యువ జంటలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేడియంలోని గ్యాలరీలన్నీ కూడా ఐటీ ఉద్యోగులతో నిండిపోవటం గమనార్హం.
పక్కా పొలిటికల్ పార్టీ కార్యక్రమంలోనూ.. తెలుగుదేశం నిర్వహించే మహానాడులోనూ కనిపించని సీన్లు గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్క్రతమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నిర్వహించే రాజకీయ సభలోనూ చంద్రబాబు నామస్మరణ ఇంత భారీగా ఉండదని చెబుతున్నారు. ఈ కార్యక్రమం మొత్తం చంద్రబాబు విజన్.. నాయకత్వంపైన పలువురు మాట్లాడారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు.. సీనియర్ నటులు మురళీమోహన్.. బాలక్రిష్ణ సతీమణి వసుంధర.. వారి చిన్నకుమార్తె ఎన్టీఆర్ తనయుడు రామక్రిష్ణ.. మనమడు చైతన్య.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. ఐపీఎస్ అధికారి ఏ. వెంకటేశ్వరరావు.. ఏపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు.. సినీ నిర్మాత బండ్ల గణేశ్.. దర్శకుడు బోయిపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు. చంద్రబాబు అరెస్టు అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన విజన్ ను కీర్తిస్తూ.. ఇంత భారీగా నిర్వహించిన కార్యక్రమం ఇదేనని చెబుతున్నారు.