ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కర్నూల్ లో పర్యటించిన చంద్రబాబు కర్నూలు టిడిపి కార్యాలయం వద్ద అన్న నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎవడ్రా రాయలసీమ ద్రోహి? పనికిమాలిన దద్దమ్మల్లారా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.
జగనే రాయలసీమ ద్రోహి అని రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించేందుకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు. సీమను దోచుకోవడమే వైసిపి పని అని సస్యశ్యామలం చేయడమే టిడిపి పని అని చంద్రబాబు అన్నారు. రాయలసీమను రతనాలసీమ చేస్తామన్న జగన్ సీమకు ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు రేపుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతాలకు, కులాలకు మధ్య చిచ్చుపెట్టి చలికాచుకునే నువ్వు రాజకీయం చేస్తావా అంటూ జగన్ ను నిలదీశారు.
ఇది పులివెందుల అనుకుంటున్నావా తరిమి తరిమి కొట్టిస్తా అంటూ చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైసిపి గుండాలు ఒకటే గుర్తుపెట్టుకోవాలని బట్టలు విప్పి కొట్టిస్తానని చంద్రబాబు మండిపడ్డారు. మర్యాదగా ఉంటే మర్యాద అని…దెబ్బకు దెబ్బ అని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 23 బాంబులకే భయపడలేదని, ఈ బెదిరింపులు ఓ లెక్క అని అన్నారు. తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని, తాను కనుసైగ చేస్తే మీరు చిత్తుచిత్తు అవుతారని వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
తాను ప్రజలకు తప్ప ఎవరికీ భయపడనని రౌడీలకు రౌడీ గుండాలకు గూండా అని చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనంత ఉద్వేగంగా మాట్లాడారు. దీంతో, చంద్రబాబు మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. చంద్రబాబు తాజా ఎనర్జిటిక్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ స్పీచ్ ఇరు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ నింపింది.