ఏపీ విపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సభలో.. చంద్రబాబు మీదా. .ఆయన పాలన మీదా పెద్ద ఎత్తున విమర్శలు చేయటమే కాదు.. మూడు దశాబ్దాలకు పైనే రాజకీయాల్లో ఉన్న బాబు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి ఏమీ చేయలేదంటూ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి ప్రసంగంపై తాజాగా విపక్ష నేత చంద్రబాబు రియాక్టు అయ్యారు. తనపై చేసిన విమర్శలకు.. ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రతిపక్ష నేత బలమైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
పులివెందులలో ఎండిపోతున్న పైర్లకు నీళ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గానికి మేలు చేస్తాడా? అని ప్రశ్నించారు. దేశంలో మోడల్ నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ వచ్చిన తర్వాత హింసా రాజకీయాలు పెరిగినట్లుగా మండిపడ్డారు. ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు రాయలేని ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్ని కడుతుందా? అంటూ కౌంటర్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. బాబాయ్ హత్యపై ఐదేళ్లు సమాధానం ఇవ్వని ముఖ్యమంత్రి జగన్.. హత్యా రాజకీయాలపై మాట్లాడటాన్ని తప్పు పట్టారు.
మరోవైపు తెలుగుదేశం సోషల్ మీడియా ఖాతాలోనూ సీఎం జగన్ ను టార్గెట్ చేసేలా పోస్టు పెట్టారు. కుప్పం సభలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై రియాక్టు అయ్యారు. అందులో ఏముందంటే.. ‘‘జగన్.. ఇరిగేషన్ అనేది నీ సబ్జెక్ట్ కాదు.. బాబు గారిది. సీమలో నీళ్ళు పారించిన చరిత్ర అయితే, నీది రక్తం పారించిన చరిత్ర. హంద్రీనీవా, గాలేరు నగిరి పరుగులు పెట్టించి, చిత్తూరు జిల్లాలోకి కృష్ణమ్మని తీసుకొచ్చిందే చంద్రబాబు గారు.
కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 87% పూర్తి చేసింది చంద్రబాబు గారు. నీ మొఖానికి మేము వదిలేసిన 13% పనులు చేయటానికి 57 నెలలు పట్టింది’’ అని ఫైర్ అయ్యారు. అంతేకాదు.. సీఎం జగన్ ఎంత షో చేసినా, కుప్పం ప్రజలు నీ నాటకాలు నమ్మరంటూ.. ‘‘ఈ సారి పులివెందుల వదిలేస్తున్నావ్ అంటగా? పోయి జమ్మలమడుగో! కమలాపురమో! డిసైడ్ చేసుకో’’ అంటూ కౌంటర్ ఎటాక్ షురూ చేయటం గమనార్హం.