రాష్ట్రంలో తప్పుల తడకలుగా ఉన్న ఓటర్ల జాబితాలను చెక్ చేయాలని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు పార్టీ కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఒకే డోర్ నెంబరులో వందల ఓట్లు ఉండడం, అసలు డోర్ నెంబరే లేని ఇళ్లలోనూ.. ఓట్లు కుప్పులు తెప్పలుగా ఉండడం వంటివి ఇటీవల వెలుగు చూశాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు అధికార పార్టీ ఎలాంటి వ్యూహాన్నయినా.. ఎంచుకుంటుందని భావించిన చంద్రబాబు అలెర్ట్ అయ్యారు.
ఈక్రమంలో ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. అక్రమాలను వివరించారు. సాక్షాలను కూడా.. పెన్ డ్రైవ్‌లో వేసి పంపించారు. దీంతో అంతో ఇంతో కదలిక అయితే.. వచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం పిలిచి.. ఏదో చర్చించింది. సరే.. ఇదిలావుంటే.. క్షేత్రస్థాయిలో మరింత దూసుకుపోవాలని.. చంద్రబాబు ఆదేశించారు. అంతేకాదు.. క్షేత్ర స్థాయిలో అక్రమ ఓట్లను గుర్తించడంలో విఫలమైతే.. చర్యలు తప్పవని నాయకులకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
దీంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు రంగంలోకి దిగారు. కానీ, ఇక్కడే అసలు సీన్ తెరమీదికి వచ్చింది. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓటర్ల జాబితా పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు వెంకటరమణ సహా మణికంఠలను ఇద్దరు వ్యక్తులు అనూహ్యంగా బైకుపై ఎక్కించుకుని వెళ్లారు. తాము.. మునిసిపల్ ఉద్యోగులమని.. మీకు మరిన్ని వివరాలు ఇస్తామని నమ్మబలికారు. తీరా.. వారు తాడిపత్రి ఎమ్మెల్యే ఇంటి ముందు బైకు ఆపారు. ఇంకేముంది.. ఎమ్మెల్యే కుమారుడి సమక్షంలో ఆయన అనుచరులు చితకబాదేశారు.
అంతేకాదు.. కొట్టినట్టు చెబితే.. మళ్లీ కొడతామని.. హెచ్చరించారు. బైకు పై నుంచి కిందపడితే గాయాల య్యాయని.. అప్పుడెప్పుడో సినిమాల్లో చంపేసి.. ఇసక లారీ గుద్దిందని రాసుకో.. అన్నట్టు.. వార్నింగ్ ఇచ్చారు. ఇది.. మచ్చుకు తాజాగా జరిగిన ఘటన మాత్రమే. మరి.. పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇలా ఉంటే.. టీడీపీ కార్యకర్తలు.. నాయకులు.. అక్రమాలపై ఏమేరకు పోరాటం చేస్తారో చూడాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.