ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఉండవల్లి లోని తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని దుయ్యబట్టారు. ఇప్పుడే ప్రజలు ఎక్కువ బాధను అనుభవిస్తున్నారని చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. కక్షతో అమరావతిని జగన్ నాశనం చేశాడని, జగన్ మూర్ఖపు నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు బలయ్యారని ఆరోపించారు.
జగన్ హయాంలో ప్రజలకు, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి ఐదేళ్లపాటు రాజధాని లేదని, ఆ పాపం జగన్ దేనని విరుచుకుపడ్డారు. మూర్ఖుడు జగన్ నిర్ణయానికి తెలుగు జాతి బలి కావాలా.అని నిలదీశారు. జగన్ పై .ఉక్రోషంతో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను ప్రజా సేవకే పరిమితం చేస్తామని చెప్పారు. ప్రజల వివరాలను దుర్వినయోగం చేయడం ద్రోహంతో సమానమని వాలంటీర్లపై విమర్శలు గుప్పించారు.
ఎలాన్ మస్క్ చెప్పినట్లు తాను గతంలో సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించానని, అది వస్తే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని అన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ లో భాగంగా ప్రకటించిన పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లబోతున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నిస్తే ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ప్రశ్నించే వారిపై దాడులు చేయడమే జగన్ విధానమని మండిపడ్డారు. కక్షతోనే మార్గదర్శి పై కేసులు పెట్టారని, పద్మ విభూషణ్ రామోజీరావును గౌరవించుకునే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. జగన్ కోసం అధికారులు కూడా భయపడి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఇక, మీడియా వాళ్ళు కేసులకి, ఒత్తిళ్లకు భయపడితే రాష్ట్రానికి నష్టం చేకూర్చిన వారవుతారని అన్నారు.