టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి.. వచ్చే ఎన్నికలకు పార్టీని ఆయన సమాయత్తం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో బాబును ఓడిస్తామని వైసీపీ నాయకులు, పార్టీ అధిష్టానం కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు కుప్పంలో ఎన్నికలకు ముందు చివరి టూర్ చేస్తున్నారు. అయితే.. ఆయన తాజాగా `సైకిలెక్కండి` అని ఓ పిలుపునిచ్చారు.
ఇక తాజాగా శాంతిపురం మండలంలో ఇచ్చిన సైకిల్ ఎక్కేయండి! అన్న పిలుపు వెనుక.. ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానించడం కాదని.. ఉన్న నాయకులు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 15 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సైకిల్‌పై.. గ్రామ గ్రామానా తిరిగి.. పార్టీ కోసం ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే ఆయన సైకిలెక్కండి! అని తమ్ముళ్లకు తాజాగా పిలుపునిచ్చారు. కానీ, దీనిని ఇతర పార్టీల్లోని అసంతృప్తులు వేరేగా అర్థంచేసుకోవడంతో టీడీపీలో ఫోన్లు మోగుతున్నాయని అంటున్నారు.
ఇరుగు పొరుగు పార్టీల నుంచి నేతాగణం .. స్థానిక నాయకులకు ఫోన్లు చేయడం మొదలైంది. అంటే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు ఇతర పార్టీల నాయకులను రమ్మని ఆహ్వానించారని.. కాబట్టి బుట్ట తట్ట సర్దేసుకోవాలని.. వారు భావించారు. దీంతో ఎడతెగకుండా.. కీలక నాయకులకు ఆయా జిల్లాల్లో ఒకటి రెండు నియోజకవర్గాల నుంచి నాయకులు పోన్ల పై ఫోన్లు చేస్తున్నారు.
అయితే. వాస్తవానికి చంద్రబాబు కాంటెస్ట్ వేరేగా ఉంది. కొత్తవారు వస్తే.. ఆయన అడ్డు చెప్పడం లేదు కానీ.. ఎలాంటి ఆశలు.. ఆకాంక్షలు లేకుండా రావాలని కోరుతున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే పార్టీలో నేతా గణం ఎక్కువగానే ఉంది. ఒక సీటుకు ఇద్దరి నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. దీంతో పార్టీలో ఖాళీలు కనిపించడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు వచ్చేవారికి పదవులు ఇచ్చేది లేదని కరాఖండీగానే అంతర్గత సమావేశాల్లో చెప్పుకొస్తున్నారు.