మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నారాయణ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని లేఖలో పేర్కొన్నా రు. హైదరాబాద్ నుంచి చిత్తూరు తరలింపులో జాప్యం వెనక దురుద్దేశం ఉందన్నారు. వైసీపీ ఎంపీ రఘు రామ అరెస్ట్ ఉదంతాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అరెస్ట్ చేశారని లేఖలో తెలిపారు. చిత్తూరు ఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు.
అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ అక్రమ కేసులతో నారాయణను అరెస్టు చేయడానికి జగన్ రెడ్డి సకల ప్రయత్నాలూ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికే నారాయణను అరెస్టు చేసిందని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దాన్ని ఎవరో ఒకరిపై రుద్దడానికి నారాయణను దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. అని అన్నారు.
పేపర్ లీకే జరగలేదని మంత్రి బొత్స ప్రకటన చేయలేదా? మాస్ కాపీయింగ్‌కు, పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారు? అరెస్టుకు సరైన ఆధారాలు చూపించలేదు. ముందస్తు నోటీసు ఇవ్వలేదు. విచారణ చేయలేదు. నేరుగా అరెస్టు చేయడం కక్షపూరిత చర్య కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎంపీ రఘురామరాజు మాదిరిగా మాజీ మంత్రి పి.నారాయణను పోలీస్ కస్టడీలో హింసించే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖరాశారు. దీని ప్రతిని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కూడా పంపారు. తక్షణం జోక్యం చేసుకుని ఆయన ప్రాథమిక హక్కులకు రక్షణగా నిలవాలి అని అభ్యర్థించారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తాడని అభియోగాలు ఉన్నాయని, నారాయణకు వ్యతిరేకంగా పనిగట్టుకుని సాక్షాలు పుట్టిస్తాడన్న అనుమానం ఉందని పేర్కొన్నారు.
నారాయణపై రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికే అక్రమ కేసులు మోపి అరెస్టు చేశారని ఆరోపించారు. తన లేఖకు ఎఫ్ఐఆర్ కాపీని, చిత్తూరు పోలీసులు నారాయణ సతీమణికి ఇచ్చిన లేఖ ప్రతిని చంద్రబాబు జతచేశారు.