టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గుడివాడలో జరిగిన ‘రా కదిలిరా’ బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై, సీఎం జగన్, వైసీపీ నేతలపై చంద్రబాబు విమర్శలతో విరుచుకుపడ్డారు. టీడీపీ-జనసేనను ఆపాలని ఎదురొస్తే తొక్కుకుంటూ పోవడమే అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జగన్ మీ బిడ్డ కాదని…రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన సొంత చెల్లితో పాటు పలువురిపై కేసులు పెట్టిన వ్యక్తి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహానుభావులు పుట్టిన గడ్డ కృష్ణాజిల్లా అని, కానీ, తన దగ్గర ఓనమాలు నేర్చుకొని తనకే పాఠాలు చెప్పే స్థితికి కొందరు వచ్చారని పరోక్షంగా కొడాలి నానికి చురకులంటించారు. వై నాట్ 175 అంటున్నారని వై కాంట్ పులివెందుల అనే నినాదాన్నిప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టిడ్కో ఇళ్లను టిడిపి కట్టిస్తే ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెట్టినట్టుగా క్రెడిట్ వారు తీసుకున్నారని వైసీపీ నేతలకు చురకలంటించారు. నోరు ఉందని పారేసుకుంటే భవిష్యత్తులో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు.
గుడివాడలో బూతుల మంత్రి, బందర్ లో నీతుల మంత్రిలు ఇప్పుడు మాజీలయ్యారని కొడాలి నాని, పేర్ని నానిలకు చురకలంటించారు. ఈ ఇద్దరిదీ బ్రహ్మాండమైన కాంబినేషన్ అని, పవన్ ను తిట్టేందుకే నీతుల మంత్రికి మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. పెడనని పీడించిన రోగి జోగి అని, తన ఇంటిపై దాడి చేసి మంత్రి పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. గన్నవరం పేరు చెప్పడం కూడా ఇష్టం లేదని, అతనిది తన స్థాయి కాదని వల్లభనేని వంశీని ఉద్దేశించి విమర్శించారు. వీళ్ళని తానే పెంచి పోషించానని, కానీ వీరంతా గంజాయి మొక్కలని ఇప్పుడు తెలుసుకున్నానని చంద్రబాబు అన్నారు. వీళ్ళు తిడుతున్నా తనను నమ్ముకున్న ఐదు కోట్ల ప్రజల కోసం భరిస్తున్నానని, వీరంతా తనకు లెక్క కాదని చెప్పారు.
అంతకుముందు, గుడివాడలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు ఆయన విగ్రహం దగ్గరకు వెళుతున్న టీడీపీ, జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కొడాలి నానిని అనుమతించి తమను ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు తీరుకు నిరసనగా జనసేన-టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.