అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఆలస్యం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో సీఎం చంద్ర బాబు నాయుడు వేగం ప్రదర్శిస్తున్నారు. కూటమి ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేసిన జనానికి మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరి కేవలం మాటలకే పరిమితం కాదని బాబు చేతల్లో చూపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే అయిదు హామీల అమలుపై చంద్రబాబు సంతకాలు చేశారు. ఇప్పుడు మరో హామీ అమలు కోసం కసరత్తులు చేస్తున్నారు.
కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఆర్థికంగా అండగా ఉంటామని బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని హామినిచ్చారు. ఇప్పుడు పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయడంపై బాబు ఫోకస్ పెట్టారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా సరే ప్రతి ఒక్కిరికీ ఈ పథకం వర్తించనుంది. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద జగన్ ఇంట్లో ఒక్కరికే రూ.15 వేలు ఇచ్చేవాళ్లు. అది కూడా తల్లి ఖాతాలోనే నిధులు జమ చేసేవారు. కానీ బాబు మాత్రం ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నారు.
తల్లికి వందనం పథకాన్ని త్వరగా అమలు చేయాలని బాబు నిర్ణయించారు. ఈ మేరకు పథకం అమలు కోసం విధివిధినాల రూపకల్పన కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఆధారంగా లబ్ధిదారులను గుర్తించనున్నారు. అలాగే విద్యార్థి హాజరు శాతం 75 కంటే ఎక్కువే ఉండాలనే నిబంధనను కొనసాగించే ఆస్కారముంది. పేద కుటుంబాలకు చెందిన వాళ్లను ఆదుకునేందుకే ఈ పథకం ద్వారా రూ.15 వేలను చంద్రబాబు ప్రభుత్వం అందించనుంది.