కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఏకాంతంగా భేటీ కావడం జాతీయ రాజకీయాలలో కూడా చర్చనీయాంశమైంది. ఇక, ఏపీలో వైసీపీతో బీజేపీకి ఉన్న చెలిమి చెడిందని, అందుకే టీడీపీతో దోస్తీకి బీజేపీ సై అంటోందని ఊహాగానాలు వచ్చాయి. ఆ ఊహాగానాలకు తగ్గట్లుగానే తాజాగా మోదీ అనుకూల మీడియాగా పేరున్న రిపబ్లిక్ ఛానెల్ లో కూడా ఇదే విషయంపై కథనం ప్రసారమైంది.
ఆ కథనానికి తోడు తాజాగా ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని, కీలక పరిణామాలు జరగబోతున్నాయని జాతీయ మీడియాలో మరో కథనం రావడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ కూటమిలోకి తిరిగి తెలుగుదేశం పార్టీ చేరబోబోందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ ఎడిషన్ లో కూమీకపూర్ అనే కాలమిస్ట్ కథనం రాశారు. దేశంలోని టాప్ కాలమిస్టుల్లో ఒకరైన కూమీకపూర్ ఈ కథనం రాయడంతో టీడీపీ-బీజేపీ పొత్తు పుకార్లకు మరింత ఊతం లభించింది.
దేశంలోని బడా పొలిటిషియన్లు, ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కూమీ కపూర్ ఈ విషయంపై కథనం రాయడంతో అది సర్వత్రా చర్చనీయాంశమైంది. జర్నలిస్టుగా అత్యంత లోతుగా రాజకీయ విశ్లేషణలు చేసే జర్నలిస్టుగా ఆయనకు గుర్తింపు ఉంది. అంతేకాదు, కూమీ కపూర్ అంచనా వేసిన చాలా విషయాలు నిజమయ్యాయన్న ట్రాక్ రికార్డు ఉంది. వచ్చే దసరా లేదా దీపావళి నాటికి బీజేపీ కూటమిలోకి టీడీపీ చేరబోతోందన్నది ఆ కథనంలో కీలక విషయం.
అంతేకాదు, టీడీపీ, బీజేపీల మధ్య పొత్తుకు సంబంధించిన చర్చలు జరిగాయని కూడా కూమీకపూర్ చెప్పారు. పొత్తు విషయంలో మోడీతో చంద్రబాబు 15 రోజుల క్రితం మాట్లాడారని కూడా ఆయన వెల్లడించారు. ఇక, అమిత్ షాతో నారా లోకేష్ పొత్తుల గురించి మంతనాలు జరిపారని కూడా అన్నారు. వైసీపీకి కటీఫ్ చెప్పి టీడీపీతో జతకట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోందని కూడా తన కథనంలో చెప్పుకొచ్చారు.
ఎన్డీఏకు కొన్ని మిత్రపక్షాలు దూరమవుతున్న నేపథ్యంలో బీజేపీ, టీడీపీ పొత్తు అనేక కోణాల్లో రాష్ట్ర, దేశ రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందని కూడా కూమీ కపూర్ చెప్పారు. ఇక, త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు గుజరాత్ లో ప్రచారం ,చేస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.