ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు.. విపక్ష నాయకుడు వైసీపీ అధినేత జగన్‌కు భారీ టెన్షన్ తప్పించారు. అదేవిధంగా జగన్ కు పని కూడా తగ్గించారనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం విశాఖ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఉప పోలింగ్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం వరకు ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.
అయితే ఈయనకు పోటీగా కూటమి తరపున కూడా అభ్యర్థి నిలబడతారని చర్చ జరిగింది. అయితే తాజా అంచనాల ప్రకారం కూటమి ఈ పోటీ నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. ఎలాగు తమకు సరిపోయినంత బలం లేనందున పోటీపడి ఉపయోగం లేదని ఏకంగా 120 మంది సభ్యులను వైసీపీ నుంచి చేర్చుకొని గెలిచినా కూడా రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
వాస్తవానికి సోమవారం అర్ధరాత్రి వరకు కూడా కూటమి పార్టీల తరఫున బైరా దిలీప్ చక్రవర్తి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా కూడా టిడిపి నాయకులు చెప్పుకొచ్చారు. కానీ, చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో మొత్తం 838 మంది ప్రజాప్రతినిధుల ఓట్లు ఉన్నాయి. వీటిలో జడ్పిటిసి. ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, నర్సీపట్నం, ఎలమంచిలి కౌన్సిలర్ల ఓట్లు ఉన్నాయి. ఎవరు గెలవాలన్నా 420 ఓట్లు రాబట్టుకోవాల్సి ఉంటుంది.
వీటిలో మెజారిటీ స్థానాలు వైసిపికే ఉండడంతో కూటమి పోటీ నుంచి విరమించుకున్నట్టు దాదాపు ఖరారు అయింది. ప్రస్తుతం కూటమిపరంగా చూస్తే టిడిపికి జనసేన బిజెపి మొత్తం కలిపితే 300 ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. గెలుపు గుర్రం ఎక్కాలంటే మరో 120 ఓట్లు సమీకరించుకోవాలి. దీనికోసం వైసిపి నుంచి చేరే వారిని ప్రోత్సహించాలి. ఇదంతా జరిగితే మీడియా సహా ప్రజల్లోనూ చర్చ జరిగి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం ఎంత ప్రయాస పడడం ఎందుకని చంద్రబాబు వెనక్కి తగ్గారుజ ఫలితంగా వైసిపి అధినేత మాజీ సీఎం జగన్‌కు ఆయన ఊరట కల్పించారని చెప్పాలి.