ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత తన తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రం తానా అంటే తందానా అంటోన్న జగన్…ఉచిత విద్యుత్ మీటర్లంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మీటర్ల వ్యవహారంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయినప్పటికీ తీరుమారని జగన్ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కుప్పం, చీపురుపల్లి, అనకాపల్లి రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (రెస్కో)లను డిస్కంలలో విలీనం చేస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కుప్పం రెస్కో స్వాధీనం ఉత్తర్వులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కుప్పం రెస్కో స్వాధీనం ఆదేశాలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఆయన లేఖ రాశారు.
అమ్మకం, పంపిణీ, లైసెన్స్ వంటి కారణాలతో ఏకపక్ష చర్యలు సరికాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్కోను ఎస్పీడీసీఎల్ లో విలీనం చేయడం అర్థరహితమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. ఈఆర్సీ నిర్ణయం నిరాశకు గురిచేసిందని, అది ప్రజాభీష్టానికి వ్యతిరేకమని అసహనం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై కుప్పం వాసులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, ఆ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.