ఏపీ సీఎం జగన్కు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం పొద్దు పొద్దున్నే లేఖ సంధించారు. ఆయన పాలనపైనా.. అనుసరిస్తున్న విధానాలపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. `మా పాలనలో ఇలానే చేశామా?` అంటూ.. చంద్రబాబు విరుచుకుపడ్డారు.
తాజాగా జగన్కు రాసిన లేఖలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిప్పులు చెరిగారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. “మా పాలనలో రైతులకు 48 గంటల్లోనే న్యాయం చేశాం. కానీ, ఇప్పుడు వారు తమ ధాన్యాన్ని అమ్ముకుని కూడా నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు. ప్రకటనలకే పరిమితం అవుతున్నారా?“ అని చంద్రబాబు ప్రశ్నించారు.
ధాన్యాన్నిపూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిదంగా రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. రైతులను నిండా ముంచే విధానాలు అనుసరిస్తున్నారని.. జగన్పై ధ్వజమెత్తారు.
కొనుగోళ్లు చేసి రెండు నెలలు పూర్తయినా.. ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే 2500 కోట్లు బకాయలు ఉన్నాయని తెలిపారు. రాయలసీమలో వేరుశనగ పంటలు నష్టపోయిన రైతులకు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతులకు కూడాన్యాయం జరగడం లేదన్న చంద్రబాబు ఈ క్రాప్ పేరుతో నిండా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అదేసమయంలో మిల్లర్లు వైసీపీ నేతలు మిలాఖత్ అయ్యారని, రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.