ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి.. తాజాగా సోషల్ మీడియాలో `ఇది అన్యాయం సార్` అనే పోస్టులు భారీ ఎత్తున పెరుగుతున్నాయి. అంతేకాదు.. మీరు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు.. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్య పాదయాత్రలు చేసినప్పుడు.. అప్పటి ప్రభుత్వాధినేత చంద్రబాబు `ఇలానే చేశారా?` అంటూ నిలదీస్తున్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు జోరుగా వైరల్ అవుతున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? ఏం జరిగింది? అనేది చూస్తే.. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పర్యటించనున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. తాజాగా ఆయన విశాఖలో పర్యటించారు.
ఈ క్రమంలో స్థానిక ఎన్ఏడీ కొత్త రోడ్డు ప్రాంతంలో వీధి దీపాలు వెలగలేదు. లైట్ల వెలుగకపోవడంతో రోడ్లు చీకటిమయమ య్యాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో చంద్రబాబు తో పాటు.. పార్టీ కార్యకర్తలు కూడా ఒకింత గందరగోళానికి గురయ్యారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని.. ఉద్దేశ పూర్వకంగానే విద్యుత్ సరఫరాను నిలిపివేశారని.. తెలియడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వ చీప్ కుట్రలు అంటూ తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు.
కాగా, ఇటీవల వారం కిందట.. చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు కూడా ఆయన బస చేసిన హోటల్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అప్పట్లో ఇది కూడా తీవ్ర వివాదానికి కారణమైంది. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ ఉన్నప్పటికీ.. సదరు హోటల్ ఉన్న ప్రాంతంలోనే విద్యుత్ కట్ అవడం.. రాజకీయంగా తీసుకున్న చర్యలేనని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. జగన్ ప్రభుత్వం మాత్రం తన పంథాను మార్చుకోకపోవడం గమనార్హం.