అనంతపురం జిల్లా పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మధ్యనున్న వివాదంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపునకు సంబంధించిన అంశంపై ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అంశాలు బయటకు రావటం.. పార్టీలోనూ తీవ్రమైన చర్చ జరుగుతోంది.
పార్టీ క్రమశిక్షణను వదిలేసి.. విభేదాలను బయటపెట్టుకోవటం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. ఈ ఇష్యూకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై తనకున్న అసహనాన్ని ఆయన కుమారుడు ఆస్మిత్ రెడ్డి ముందు సీఎం చంద్రబాబు ప్రదర్శించారని చెబుతున్నారు. అనంత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన తాడిపత్రి ఎమ్మెల్యే ఆస్మిత్ రెడ్డిపై ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
బాహాటంగా గొడవలకు దిగటం ఏంటి? ఇష్యూస్ ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా? అంటూ ఆస్మిత్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఇష్యూలో తాము పార్టీ కార్యకర్తలకు పనులు కల్పించేందుకేనంటూ తమ తీరును సమర్థించుకునే ప్రయత్నం చేయగా.. చంద్రబాబు ఆయన మాటలకు అడ్డుపడినట్లుగా సమాచారం. అంతేకాదు.. ‘కార్యకర్తల సంగతి నేను చూసుకుంటా’ అంటూ ఆస్మిత్ రెడ్డికి క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు తాజా రియాక్షన్ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.