టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు.. పార్టీని లైన్లో పెట్టుకునేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎట్టి పరిస్థి తిలోనూ.. అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా.. చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు చేస్తున్నారు. నాయకులను హెచ్చరిస్తున్నారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం.. పనిచేయాలని కూడా.. చంద్రబాబు సూచిస్తున్నారు. ఇక, తాను కూడా.. త్వరలోనే బస్సు యాత్ర చేయనున్నట్టు కొన్నాళ్ల కిందట సంకేతాలిచ్చారు.
గతం ప్రభుత్వంలో అమలు చేసిన.. అన్నక్యాంటీన్లను ప్రస్తుతం టీడీపీ నాయకులు సొంత సొమ్ము ఖర్చు చేసి మరీ నిర్వహిస్తున్నారు. వీటికి ఆదరణ బాగానే ఉంది. సో.. దీనిని బట్టి.. పాత పథకాలైన రంజాన్ తోఫా.. సంక్రాంతి కానుక.. క్రిస్మస్ కానుక వంటివాటిని అమలు చేయడం ఖాయమనే సంకేతాలు పంపించినట్టు అయింది.
కానీ, వీటి కన్నా మెరుగైన పథకాలుగా.. ప్రస్తుతం వైసీపీ ఇస్తున్న కానుకలను ప్రజలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అమలు చేసే సంక్షేమం, కార్యక్రమాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కానీ, వీటిని చంద్రబాబు ఇప్పుడే కాదు.. ఎన్నికలకు ముందు మాత్రమే వెల్లడించనున్నట్టు కొందరు చెబుతున్నారు.
ఇది కీలకమైన విషయం. రాజకీయంగా. చంద్రబాబు, జగన్లు తిట్టుకున్నా.. వ్యూహ ప్రతివ్యూహాలు వేసుకుని.. ముందుకు సాగినా.. పార్టీతరఫున ప్రజల కు ఏం చేయనున్నారు? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. అమలు చేయనున్న పథకాలు ఏంటి? ఏ వర్గానికి ఎలాంటి మేలు చేస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
దీనిపైనే చంద్రబాబు టీం ప్రశ్నిస్తోంది. మాకు ఏమీ చెప్పలేదు. నియోజకవర్గాల్లో మాత్రం పర్యటించమని కోరుతున్నారు. ఇలా అయితే.. ఎలా వెళ్లగలం.. అని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో.. పార్టీ చూసుకుంటుందనేది చంద్రబాబు వాదన.
సరే.. ఏది ఎలా.. ఉన్నా.. చంద్రబాబు ప్రయత్నం మాత్రం చాలా బాగుందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. ఈ విషయంలో పార్టీ నేతలు సక్రమంగా లేకపోతే.. నష్టపోయేది వారేననే వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. అయితే.. ఇంత చేసినా.. చంద్రబాబు కొన్ని విషయాలను పక్కన పెట్టారనే వాదన తమ్ముళ్ల మధ్య చర్చకు దారితీస్తోంది.
వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని అనుకున్నప్పుడు.. దానికి తగిన విధంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని.. ముఖ్యంగా ప్రస్తుతం ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు కోరుతున్నారని.. వాటిపై క్లారిటీ ఇవ్వలేదని.. పేర్కొంటున్నారు.