నిమిష నిమిషానికీ పెరుగుతున్న కృష్ణమ్మ.. గంటకు గంటకు పెరుగుతున్న వరద.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు.. చంద్రబాబు విజయవాడలో పర్యటించారు. విపత్తు నిర్వహణ శాఖ బోట్లలో ఆయన సింగ్నగర్లో పర్యటించారు. బాధితులను ఓదార్చారు. నేనున్నానంటూ.. భరోసా కల్పించారు. ఆ వెంటనే విజయవాడ కలెక్టర్ ఆఫీసునే తన కార్యాలయంగా మార్చుకుని సమీక్షించారు. మంత్రులను, అధికారులను ఉన్నపళాన రంగంలోకి దించారు. ఆహార పొట్లాలు తయారు కావాల్సిందేనని.. అర్ధరాత్రి అయినా.. పొయ్యిలు వెలిగించాల్సిందేనని.. ఆహారం తయారు చేయాల్సిందేనని ఆదేశించారు.
అంతా ఓకే అన్నారు. తెల్లారి 6 గంటలకల్లా.. ఆహారం, నీటిని బాధితులకు అందిస్తామని మాటిచ్చారు. కథ సమాప్తం! కానీ, చంద్రబాబుకు కంటిపై కునులేదు. మనసులో ఎక్కడో ఏదో అలజడి. బాధితుల ఆక్రందన, వారి క్షుద్భాద.. ఎక్కడో ఆయనకు గిలి పెడుతోంది. బాధితుల కష్టాలు చూసిన తర్వాత.. అలా వారికి నాలుగు మాటలు చెప్పి.. వెళ్లిపోతే.. బాగుంటుందా? అని ఆయన భావించారు. అంతేకాదు.. అధికారులకు చెప్పాను.. మంత్రులు, నాయకులకు కూడా చెప్పాను.. అయినా.. వారు సక్రమంగా పనిచేస్తారా? లేదా? అనే సందేహాలు ఆయనను చుట్టుముట్టాయి.
అప్పటికే.. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలైంది. అయినా.. టైం చూసుకోలేదు. అప్పటి వరకు ఉదయం నుంచి తిరిగి తిరిగి.. బాధితులను పరామర్శించానన్న బడలిక కూడా.. ఏ కోశానా కనిపించలేదు. ఆ వెంటనే`పదండి!` అంటూ.. మళ్లీ విపత్తు నిర్వహణ శాఖ పడవలను రంగంలోకి దించారు. తనే స్వయంగా వాటిలో కూర్చుని.. మరోసారి ఆ అర్ధరాత్రి వేళ.. మరోవైపు.. బుడమేరు పొంగుతోందన్న సమాచారం నేపథ్యంలోనూ చంద్రబాబు ముందుకు కదిలారు. అయితే.. ఈ సారి ఆయన ఉత్త చేతులతో కాదు.. అంతో ఇంతో ఆకలి తీర్చే.. బిస్కట్లు, కుర్ కురే పొట్లాలు, స్వీట్లు, ఇతరత్రా చిరు తిళ్లతో ఆయన సిబ్బందిని తీసుకుని ముందుకు కదిలారు.
సాయంత్రం ఆయన ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో కలియ దిరిగారో మరోసారి అక్కడే రాత్రి 1 గంట సమయంలో తిరిగారు. ఈ సారి బాధితులను మైకు పట్టుకుని పిలిచి.. మరీ స్వయంగా వారికి ఆయా పొట్లాలను అందించారు. తాగునీటి బాటిళ్లను సరఫరా చేశారు. మేమున్నాంటూ.. వారికి భరోసా కల్పించారు. ఉదయాన్నే పూర్తిస్థాయిలో ఆహారం అందిస్తామని కూడా చెప్పారు. ఈ పరిణామాలను చూసిన వారు.. ఎవరు చేయగలరు.. చంద్రబాబు తప్ప! అని అనకుండా ఉండలేక పోయారు.