రేపు జరగనున్న తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలలో వైసీపీ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. మాచర్ల, పుంగనూరులో పంచాయతీ ఎన్నికలకు.. మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని, అభ్యర్ధులకు రక్షణ కల్పించాలని చంద్రబాబు కోరారు. అక్కడి ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, పోలీసులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
పుంగనూరు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల అక్రమాలను స్థానిక నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, వైసీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ అక్రమాలపై అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు అండగా ఉంటానని చంద్రబాబు భరోసానిచ్చారు.
కాగా, మైలవరం పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన బీటెక్ విద్యార్థిని సగ్గుర్తి సౌందర్యను గెలిపించాలని చంద్రబాబు స్వయంగా ట్వీట్ చేశారు. విద్యార్థిని అయిన సౌందర్య సర్పంచ్‌గా పోటీ చేస్తుండటం సంతోషకరం అన్న చంద్రబాబు…యువతకు, ముఖ్యంగా మహిళలకు సౌందర్య స్ఫూర్తిదాయకమన్నారు. అందుకే ఆమె అభ్యర్థిత్వాన్ని టీడీపీ బలపరుస్తోందని, సౌందర్యను గెలిపించి రాజకీయాల్లోకి విద్యావంతులైన యువతను ఆహ్వానించాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, ఏపీ పంచాయతీ ఎన్నికలకు రేపు తొలివిడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలకమైన ప్రకటన చేసింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఎస్ఈసీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవం అయిన స్థానాలకు సంబంధించిన అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ సమాచారమిచ్చింది. రేపు పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఎల్లుండి వారికి డిక్లరేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి.