ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందు మతంపై, ఆలయాలపై, హిందు ధర్మంపై దాడి జరుగుతోందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. విమర్శలు రావడమే కాదు…ఆ విమర్శలకు తగ్గట్లే జరుగుతున్న పరిణామాలు కూడా ఉండడంతో అవి నిజమేమోనని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో వినాయకచవితి సందర్భంగా మండపాలు, గణేష్ విగ్రహాలు పెట్టవద్దంటూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే వినాయక చవితి మండపాలపై జగన్ వ్యవహార శైలిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. వైఎస్ వర్థంతి సందర్భంగా జగన్ కు గుర్తురాని కరోనా నిబంధనలు, వినాయక చవితికి మాత్రం ఎలా గుర్తుకు వచ్చాయని మండిపడ్డారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ…ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఈ నెల 10వ తేదీన వినాయక చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మద్యపాన నిషేధం అని జనాన్ని జగన్ మోసం చేశారని, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. మద్యం వ్యాపారంలో రూ.25 వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, ఒక్క కొత్త రోడ్ వేయకుండా…రోడ్డు సెస్ రూ.1200 కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. జగన్ రెడ్డి అండ్ కో లూఠీ కోసమే అప్పులు చేసి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని, రూ.75 వేల కోట్ల పన్ను భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు.
చింతమనేని ప్రభాకర్, దియ్యా రామకృష్ణ తదితర నేతల అక్రమ అరెస్ట్ లపై న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఏపీలో లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా ప్రజలను భ్రమింపజేశారని, బాధిత మహిళలకు న్యాయం జరిగేందుకు ఈ నెల 9వ తేదీన నర్సరావుపేటలో నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలంతా తిరగబడే రోజు దగ్గరలో ఉందని చంద్రబాబు అన్నారు.