టీడీపీ అధినేత చంద్రబాబు డేట్ ఫిక్స్ చేశారు. ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్న `తొండి` వైఖరిపై ఉద్యమించేందుకు ఈ నెల 29న పార్టీ నేతలను, శ్రేణులను ఆయన సిద్ధంగా ఉండమని సూచించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ.. సంక్షేమ పథకాల అమల్లో నూ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న తొండి వైఖరిపై.. ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.
అంతా తొండి!
కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్లో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న చంద్రబాబు.. వారం రోజులు టీకాలు వేయకుండా ఒక్కరోజు మాత్రమే టీకాలు వేసి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఏపీలో కరోనా మరణాలు ప్రభుత్వ లెక్కల కంటే 14 రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు. జాబ్ కేలండర్ పై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంద న్న టీడీపీ అధినేత ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎగనామం అంటే.. ఇదే!
ఏపీలో `చేయూత` పేరుతో మోసం జరుగుతోందన్న చంద్రబాబు.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడాదికి రూ.36వేలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ.1,80,000 చెల్లించాల్సి ఉండగా లబ్ధిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున కోత విధించారన్నారు. దీనిని 4 ఏళ్లకు మాత్రమే పరిమితం చేసి.. కొంతమందికి మాత్రమే ఏడాదికి రూ.18వేలు చెల్లింపు జరుగుతోందని, ఇలా ఒక్కో మహిళకు రూ.లక్షా 5 వేలు ఎగనామం పెట్టి వంచించారని వివరించారు. డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేస్తానని జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
తెల్ల ఏనుగులు!
తమిళనాడులో సమర్థులైన, నోబుల్ గ్రహీతలైన వారిని సలహాదారులగా పెట్టుకుంటే… ఏపీలో మాత్రం అసమర్థులను సలహాదారులుగా పెట్టుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా రేప్‌లు, సెటిల్మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్ రాజ్యమేలుతున్నాయన్నారు.