గన్నవరంలో టిడిపి కార్యాలయం విధ్వంసం, కార్యకర్తలపై దాడి ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసులపై టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా ఉంటున్నారని, గూండాలకు పోలీసులు స్వేచ్ఛనిచ్చినట్టుగా కనిపిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డికి గన్నవరం ఘటనపై చంద్రబాబు లేఖ రాశారు. వైసిపి గూండాలు పట్టపగలు అరాచకం సృష్టించినా టిడిపి నాయకులు, కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పోలీసు శాఖను వైసీపీలో విలీనం చేశారా లేక మూసేశారా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటన ఉదాహరణ అని, ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. అంతేకాదు, ఈ దాడికి కారకులపైన వారిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, ఏపీలో ఇది వైసీపీ ఉగ్రవాద దాడి అని చంద్రబాబు అన్నారు.
టిడిపి నేతలు, కార్యకర్తలపై ఏడేళ్లకు తగ్గకుండా శిక్ష పడేలా సెక్షన్లు వెతికిమరీ కేసులు పెడుతున్నారని, కానీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై శిక్ష పడేందుకు అవకాశం లేని సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో పోలీసులకు టిడిపి నేతలు అనేక వినతి పత్రాలు ఇచ్చారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే శాంతి భద్రతలు ఇంత అధ్వాన స్థితికి చేరాయని చంద్రబాబు మండిపడ్డారు.
‘‘గన్నవరం టీడీపీ కార్యాలయం పై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు?’’ అంటూ గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ మూకల దాడి వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయం పై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు?(1/2)#YSRCPRowdyism #YCPGoondas pic.twitter.com/dFqEH51JCZ
— N Chandrababu Naidu (@ncbn) February 20, 2023