టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన నేరుగా హోం శాఖ మంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా సుమారు గంటకుపైగా ఆయనతో చంద్రబాబు చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణ-ఏపీ విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చించారు. సుదీర్ఘంగా పెండింగులో ఉన్న పలు అంశాలపైనా ఆయనతో చర్చించినట్టు తెలిసింది. అదేవిధంగా పలు రాజకీయ పరమైన అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు వెలువరించిన నాలుగు శ్వేత పత్రాల విషయాన్ని కూడా.. షాకు చంద్రబాబు వివరించారు. ఆయా పత్రాల్లో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, దోపిడీ వంటివాటిని వివరించారు. ముఖ్యంగా సహజ వనరులకు సంబంధించిన శ్వేత పత్రంలో వైసీపీ నాయకులు చేసిన దోపిడీని సమగ్రంగా వివరించిన విషయం తెలిసిందే. ఇవే విషయాలను ప్రత్యేక నివేదిక రూపంలో అమిత్ షాకు వివరించారు. వైసీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై అమిత్‌షాకు చంద్రబాబు నివేదిక సమర్పించారు.
అదేవిధంగా రాష్ట్రంలో జగన్ హయాంలో జరిగిన అరాచకాలపైనా హోంమంత్రికి నివేదిక సమర్పించారు. ఆయా విషయాలను ధ్రువీకరిస్తూ.. చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలోనూ పోస్టు చేశారు. హోం మంత్రికి వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను వివరిం చినట్టు తెలిపారు. శ్వేతపత్రాలకు సంబంధించిన సారాంశంతో కూడిన నివేదికను కూడా అందించానన్నారు. కాగా, చంద్రబాబు పర్యటన బుధవారం కూడా కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు.
ఏపీకి సంబంధించిన నిధులపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టుల విషయాన్ని మరోసారి ప్రస్తావించి ఫైన్ చేయించనున్నారు. ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను ప్రధానంగా ప్రస్తావించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. వన్ జనపథ్ లో ఏపీ సీఎం చంద్రబాబుకు కేటాయించిన నివాసంలో బుధవారం పూజలు నిర్వహించనున్నారు. ఇక, నుంచి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా.. ఈ నివాసంలోనే ఉండనున్నారు. ఇదిలావుంటే.. జగన్‌పై చంద్రబాబు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మరింత ఇమేజ్ కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా కేంద్రం కూడా ఆయనను పక్కన పెట్టే అవకాశం ఉందని సమాచారం.