రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జనసేనలతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న టీడీపీ.. ఈ దిశగా పలు కార్యాచరణలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. సీట్ల పంపకాల్లో అసెంబ్లీకి 144 సీట్లు టీడీపీకి దక్కాయి. అయితే.. వీటిలో 94 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 50 స్థానాలను అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీనికోసం తమ్ముళ్లు తెగ వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను గురువారం ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన, బీజేపీ ఏయే స్థానాల నుంచి పోటీ చేయాలన్న విషయంపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందన్నారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు కూడా వారి అభ్యర్థు లను ప్రకటిస్తాయని స్పష్టం చేశారు.
“ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాం. పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి అని ప్రతివాళ్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో ఉంది. రేపటి ఎన్నికల్లోనూ బీజేపీనే వస్తుందని అందరూ చెబుతున్నారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు రాకపోయినా, ఉత్తరాదిలో వారిదే ప్రభంజనం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన విధ్వంసంతో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించాలంటే.. నిధులు, అనుమతులు, క్లియరెన్సులు ఇలా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా అవసరం. అందుకే పొత్తు పెట్టుకున్నాం“ అని చంద్రబాబు మరోసారి పొత్తులపై వివరణ ఇచ్చారు.
కేంద్రం సహకరించకపోతే.. తాము అధికారంలోకి వచ్చినా ప్రయోజనం ఉండదని చంద్రబాబు అన్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే ఓట్లు చీలిపోయి వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. అప్పుడు కనీసం.. ప్రశ్నించేందుకు కూడా ఎవరూ మిగలరని అన్నారు. తక్కువ సీట్లు తీసుకున్నారంటూ జనసేన పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, మీకు ఇన్ని సీట్లేనా అంటూ బీజేపీ వాళ్లను రెచ్చగొడుతున్నారని అన్నారు. వైసీపీ వలలో చిక్కుకోవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు.
“నేను కూడా గర్వానికి పోలేదు. నేను 14 ఏళ్లు సీఎంగా చేశాను, కేంద్రంలోనూ చక్రం తిప్పాం. నేను ఎక్కడికీ పోను, ఎవరితోనూ సర్దుబాటు చేసుకోను అని భీష్మించుకు కూచుంటే ఎవరికి లాభం? అందుకే ప్రజాహితం కోసం, ప్రజల భవిష్యత్ కోసం అందరం రాజీపడ్డాం. ఇది రాష్ట్ర హితం కోసం కుదుర్చుకున్న పొత్తు“ అని చంద్రబాబు చెప్పారు.