టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోని అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్డు తిని చిన్నారి మరణించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గుల్లేపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో గుడ్డు తిన్న చిన్నారి మృతి చెందిన వైనం పలువురిని కలచివేసింది. ఈ వ్యవహారంలో మానవ హక్కుల సంఘం కూడా జోక్యం చేసుకొని నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, పరిహారం చెల్లించబోమంటూ ప్రభుత్వం కోర్టు తలుపు తట్టింది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో బాలిక మరణించిందని, ఆ బాలిక కుటుంబానికి 8 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని హెచ్ఆర్సీ చెప్పిందని చంద్రబాబు అన్నారు. కానీ, ఆ పరిహారం ఇవ్వడం కుదరదంటూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ సంక్షేమ ప్రభుత్వం? కనీస మానవత్వం లేదా? అని ఆయన నిలదీశారు. కోర్టుకు రాకుండా ఉండాల్సిందంటూ హైకోర్టు వ్యాఖ్యానించిందంటే ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటు అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
మరోవైపు, 2024 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గం కుప్పానికి సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గ బాధ్యతలను టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శ్రీకాంత్ సంచలన విజయం సాధించడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆ విజయానికి గుర్తింపుగా తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కుప్పం నియోజకవర్గ బాధ్యతలను శ్రీకాంత్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. 38 మంది పార్టీ సభ్యులతో ఏర్పాటైన కుప్పం నియోజకవర్గ ఎన్నికల కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ ను చంద్రబాబు నియమించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ కమిటీ పని చేస్తుంది.