తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని, తమ పాలనలో మహిళల రక్షణకు పెద్దపీట వేశామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు చేయాలంటే మృగాళ్లు వణికిపోవాలని, అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దిశ చట్టం తెచ్చామని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా గొప్పలు చెప్పుకున్నారు. అయితే, దిశ చట్టం వచ్చినప్పటికీ ఏపీలో మహిళలపై లైంగిక దాడులకు అడ్డుకట్ట పడలేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తాడేపల్లి సమీపంలోని సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద యువతిపై జరిగిన అత్యాచార ఘటన…దిశ చట్టం నీరుగారిందనడానికి నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీతానగరం ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సీఎం జగన్ నివాసానికి 2కిలోమీటర్లు, డీజీపీ కార్యాలయం, రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి 3కిలోమీటర్ల దూరంలో ఈ అత్యాచార ఘటన జరగడం అమానుషమంటూ డీజీపీ సవాంగ్ కు చంద్రబాబు లేఖ రాశారు.
సీతానగరం పుష్కర్ ఘాట్ ప్రాంతంలో కట్టుదిట్టమైన పోలీసింగ్, పెట్రోలింగ్ అవసరమని, ఇక్కడి పోలీస్ అవుట్ పోస్టు శిథిలావస్థలో ఉండటం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమి దుయ్యబట్టారు. డీజీపీ కార్యాలయం, సీఎం నివాసాలకు దగ్గర మాదక ద్రవ్యాల అమ్మకం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కఠిన చర్యలు చేపట్టడం లేదని, అందుకే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు వెల్లడించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని చట్టాలు, యాప్లతో ఉపయోగం ఏమిటని చంద్రబాబు నిలదీశారు. అందుబాటులో ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే ఈ తరహా ఘటనలు జరగవని, ఘటన జరిగి ఇన్ని గంటలవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.
దిశా చట్టం కింద ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేశారని, 24గంటల్లో ఎన్ని ఘటనలపై చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ మొబైల్ వాహనాలు, ప్రత్యేక యాప్ లన్నీ మోసపూరితంగా మారాయని దుయ్యబట్టారు. వైసీపీ రంగుల ప్రచారానికే దిశ చట్టం పనికొచ్చినట్లుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.