భారత ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. గత ఐదేళ్లుగా అప్పులతో అతలాకుతలమైన రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయం కావాలని మోడీని చంద్రబాబు కోరారు. అమరావతి రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా వంటి పలు అంశాలపై మోడీతో చర్చించారు. అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు, ఏపీ ఎన్డీఏ కూటమి ఎంపీలు అరగంట పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురీతో చంద్రబాబు భేటీ అయ్యారు.
మరోవైపు, ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, లభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలపై ప్రధానితో రేవంత్ చర్చించారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రులను కలిశాం. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానికి వినతి పత్రం ఇచ్చాం. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు విరక్తి చెందారు. ఆ పార్టీపై విరక్తితో ‘ఇండియా’ కూటమికి ప్రజలు ఓట్లేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది’ అని అన్నారు.
కాగా, కేంద్ర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడుకు రెండు కేంద్ర కమిటీల్లో చోటు దక్కింది. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీలో రామ్మోహన్ స్థానం సంపాదించుకున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో బొగ్గు గనుల శాఖ మంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఇక, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో చోటు దక్కింది.