రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని కేంద్రం తన చేతిలోకి తీసేసుకుంది. కేసీఆర్-జగన్ ల మధ్య కృష్ణా జలాల వివాదం పరిష్కారం కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఒంటెత్తు పోకడల కారణంగానే తెలంగాణా-ఏపీల మధ్య జలజగడాలు పెరిగిపోయాయి. సమస్య పరిష్కారానికి జగన్ చేసిన ప్రతిపాదనలను, వినతులను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు, కేంద్రానికి జగన్ లేఖలు రాసినా స్పందన కనబడలేదు. దాంతో చేసేది లేక చివరకు ఏపి ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది.
దీన్ని అవకాశంగా తీసుకున్న కేంద్రం తాజాగా జారీ చేసిన గెజిట్ లో విచిత్రమైన షరతులు పెట్టింది. ఆ షరతుల ప్రకారం ఖర్చులంతా తెలుగు రాష్ట్రాలవి పెత్తనమంతా కేంద్రానిది. షరుతులు కూడా ఎంత విచిత్రంగా ఉన్నాయంటే గోదావరి, కృష్ణా బోర్డుల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో రూ. 200 కోట్లను 60 రోజుల్లో జమచేయాలట. అలాగే నిర్వహణ ఖర్చులు ఎంత చెబితే అంత చెప్పిన 15 రోజుల్లోనే జమచేయాలట. ప్రాజెక్టులను నిర్మించుకోవాలంటే కేంద్ర జలశక్తి శాఖతో పాటు కేంద్ర జలవనరుల బోర్డు (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతులు పొందాలట.
ఇవి కాకుండా ప్రాజెక్టులకు నీటిని వదలాలన్నా, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరట. రాష్ట్రాలు లేఖలు రాయగానే కేంద్రం ఎన్ని రోజుల్లో అనుమతిస్తుందనే విషయంలో గెజెట్ క్లారిటి ఇవ్వలేదు. నిజానికి రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడంలో కేంద్రానికి పెత్తనం ఇవ్వనేకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఒకేసారి రెండు రాష్ట్రాల జుట్టు కేంద్రం చేతికి చిక్కినట్టే.
కానీ, తాజా వివాదంలో కేసీఆర్ వైఖరి వల్లే ఏపీ కేంద్రం జోక్యాన్ని కోరాల్సి వచ్చింది. కేంద్రానికి పెత్తనం కట్టబెట్టడం రాష్ట్రాలకు ఎంతమాత్రం మంచిది కాదు. కానీ, తప్పని పరిస్ధితుల్లోనే ఇపుడు ఏపీ కేంద్రాన్ని అడగాల్సొచ్చింది. వివాద పరిష్కారం వరకే కేంద్రం పరిమితమవుతుందని అనుకునేందుకు లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గ్యాప్ ను కేంద్రం అడ్వాంటేజ్ గా తీసుకోదని గ్యారెంటీ ఏమీలేదు. అప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తక మానదు. ముందు ముందు ఏమి జరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.