బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన అనుచరుడు, పరిశ్రమల శాఖ మంత్రి పార్ధా చటర్జీ పీకల్లోతు ఇరుక్కుపోయినట్లే. ఉపాధ్యాయుల నియమాకాల్లో జరిగిన అవినీతిలో ఎన్పోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం పార్ధా చటర్జీ తో పాటు ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ, మంత్రి పీఎస్ ను కూడా అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఈడీ చేసిన దాడుల్లో మంత్రి దగ్గర ఏమీ డబ్బు దొరకలేదు కానీ అర్పిత దగ్గర మాత్రం రు. 21 కోట్ల హార్డ్ క్యాష్ దొరికింది.
ముగ్గురిని అరెస్టుచేసిన ఈడీ అధికారులు గడచిన రెండు రోజులుగా ఒడిస్సాలో విచారిస్తున్నారు. విచారణలో అర్పిత కీలకమైన విషయాలను చెప్పినట్లు సమాచారం. తన దగ్గర దొరికిన 21 కోట్ల రూపాయలు పూర్తిగా మంత్రి పార్ధాచటర్జీవే అని అంగీకరించారట. టీచర్ల నియామకాల్లో భారీగా డబ్బులు వసూలు చేసి డిపాజిట్లు చేసేందుకు 12 నకిలీ సంస్ధలను నడుపుతున్నట్లు అర్పిత చెప్పారట. అలా వసూలు చేసిన డబ్బుతో పార్ధా+అర్పిత పేరుతో జాయింట్ గా ఆస్తులను కొన్నట్లు అంగీకరించారట.
తమిద్దరి పేర్లతో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను అందించటంతో పాటు వాటికి సంబంధించిన పత్రాలను కూడా అర్పిత ఈడీ ఉన్నతాధికారులకు ఇచ్చేశారట. గ్రూపు సీ, గ్రూప్ డీ ఉద్యోగాల నియామకాలు, అపాయిట్మెంట్ లెటర్లు కూడా అర్పిత దగ్గర అధికారులకు దొరికాయట. వెస్ట్ మేదినీపూర్ లో ఒ స్కూలు ఏర్పాటు పేరుతో మంత్రి భారీ ఎత్తున ఆస్తులను కూడ బెట్టినట్లు అర్పిత చెప్పిందని తెలుస్తోంది.
అరెస్టవ్వగానే అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరిన పార్ధా ఆరోగ్యం బాగానే ఉంది ఒడిస్సా ఎయిమ్స్ డాక్టర్లు సర్టిఫై చేశారు. ఈయనకు ఆసుపత్రి, డాక్టర్ల వైద్యం అవసరమే లేదని తేల్చిచెప్పింది. అరెస్టయిన వాళ్ళు ఆగష్టు మూడోతేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండాలని ఈడీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. మొత్తంమీద జరుగుతున్నది చూస్తుంటే మమతకు అత్యంత సన్నిహితుల్లో ఒకడైన పార్ధా చటర్జీ పీకల్లోతు ఇరుక్కుపోయినట్లు అర్ధమవుతోంది. సన్నిహితురాలు అర్పిత అప్రూవర్ గా మారిపోయినట్లు అర్ధమవుతోంది. మరి తర్వాత ఏమి జరుగుతుందో చూడాలి.