గత ఏడాదికి.. ఇప్పటికీ.. కరోనా తీవ్రతలో మార్పు వచ్చింది. దీంతో మాస్కులు ధరించడం తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా మాస్కులు ధరించాల్సిందేనని హుకుం జారీ చేసింది. ధరించనివారి నుంచి జరిమానాలు సైతం వసూలు చేస్తోంది. ఇక, ప్రజల్లోనూ 89% మంది మాస్కులు ధరిస్తున్నారు. అయితే.. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా ఉన్న నేపథ్యంలో వైద్య నిపుణులు.. రెండేసి మాస్కులు ధరించడం మంచిదని చెబుతున్నారు. దీంతో ప్రజల్లో ఒకవిధమైన గందరగోళం నెలకొంది.
ఒకటి ధరిస్తేనే ఊపిరి ఆడడంలేదు.. రెండు ధరించాలా? అనే సందేహం ఉంది. దీనికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనిలో ఒక మాస్కు ధరిస్తే.. ఎంత మేరకు రక్షణ ఉంటుంది? రెండు ధరిస్తే.. ఏం జరుగుతుంది? అనే అంశాలపై.. స్పష్టమైన వివరణ ఇచ్చింది. మరి అవేంటో చూద్దామా!!
మాస్క్ తప్పనిసరి
తొలుత వెలుగులోకి వచ్చిన వూహాన్ వైరస్ వ్యాప్తి రేటు 2.5 కాగా.. బ్రిటన్ రకం వైరస్ రేటు 4గా అధ్యయనాలు వెల్లడించాయి. అంటే ఒకరికి వైరస్ సోకితే వారి నుంచి నలుగురికి వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మన దేశంలో బ్రిటన్ రకం వైరస్ ఎక్కువ ఉధ్ధృతంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దగ్గడం, తుమ్మడం ద్వారానే కాకుండా.. మాట్లాడడం, గట్టిగా అరవడం, గొంతెత్తి పాడడం వంటి వాటి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతోందని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది. 33-59 శాతం వైరస్ వ్యాప్తి ఇలాగే జరుగుతోందని పేర్కొంది.
బహిరంగ ప్రదేశంలో కంటే.. తలుపులు మూసి ఉన్న పెద్ద గది, హాలులో ఈ వైరస్ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి గదిలో కరోనా వైరస్ గాలిలో మూడు గంటల పాటు ఉండే అవకాశాలున్నాయి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఎంత మోతాదులో వైరస్ వెలువడుతుందో.. అందులో దాదాపు సగం తొలిగంటలో గాలి నుంచి నేలకు జారిపోతోంది. మిగిలిన సగం నేలపై పడడానికి మరో 2 గంటల సమయం పడుతుంది.
మాట్లాడినప్పుడు, పాడినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ 6 అడుగుల దూరం వరకూ వ్యాప్తి చెందుతుంది. అదే తుమ్మినప్పుడు 18 అడుగుల దూరం వరకూ కూడా వ్యాపిస్తుంది. అందుకే తలుపులు, కిటికీలు ఎప్పుడూ తెరిచి ఉంచాలి. గాలి వల్ల వైరస్ బయటకు వెళ్లిపోతుంది.
ఎన్ 95 మాస్కు ధరిస్తే.. రెండు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. దీనివల్ల దాదాపు 95% రక్షణ లభిస్తుంది.
సీడీసీ అధ్యయనం ఏం చెబుతోంది?
లోపల సర్జికల్… బయట క్లాత్
అందరికీ ఎన్ 95 ధరించడం సాధ్యం కాదు. పైగా ఖరీదైనది కాబట్టి కుదరని వాళ్లు రెండు మాస్కుల విధానాన్ని అనుసరించాలి.
అలా అని ఒకేసారి రెండు సర్జికల్ మాస్కులు పెట్టుకోవద్దు. రెండు క్లాత్ మాస్కులు కూడా వాడవద్దు.
ముందుగా సర్జికల్ మాస్కు ధరించిన తర్వాత.. దానిపైన క్లాత్ మాస్కును పెట్టుకోవాలి. అంటే లోపలి వైపు సర్జికల్ మాస్కు, వెలుపలి వైపు క్లాత్ మాస్కు ఉండాలి.
ఈ విధానం వల్ల 85.4 శాతం వరకూ రక్షణ. గాలి పీల్చుకోవడంలో ఎటువంటి ఇబ్బందులుండవు.
రెండు మాస్కులు లేకపోతే..
రెండు మాస్కులు అందుబాటులో లేనప్పుడు.. ఒక్క సర్జికల్ మాస్కును కూడా సాధారణంగా కాకుండా కొత్త విధానంలో ధరించాలి.
సర్జికల్ మాస్కులో చెవులకు ధరించే వృత్తాకార దారాల మొదటి భాగాన్ని గట్టిగా ముడివేయాలి. ఆ ముడి వేసినప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా చేసుకోవాలి. దీనివల్ల 77 శాతం రక్షణ ఉంటుంది.
అలా రెండు వైపులా ముడివేసి ధరించడం ద్వారా ముక్కు, నోటిని పూర్తిగా కప్పివేసినట్లుగా ఉంటుంది. తద్వారా వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది.
ఎటువంటి ముడులు లేకుండా.. ఒక్క సర్జికల్ మాస్కును మాత్రమే సాధారణంగా వాడితే.. దాని వల్ల 56 శాతం రక్షణ లభిస్తుందని సీడీసీ చెబుతోంది.
సో.. దీనిని బట్టి.. ఒకమాస్కు ధరించాలా? రెండు మాస్కులు ధరించాలా? అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఏదేమైనా.. మాస్కు ధరించడం మాత్రం తప్పనిసరి!