గవర్నర్ అనుమతి లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు అన్నారు. అరెస్టే కాదు అసలు బాబును విచారించడానికి, ఆయనపై కేసు నమోదు చేయడానికి కూడా గవర్నర్ అనుమతి తప్పనిసరని చట్టం చెబుతోందని ఈ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం బాబు అరెస్టును, ఆయనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేసే అధికారం కోర్టుకు ఉందని ఆయన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తనపై సీఐడీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 19న హైకోర్టు విచారణ జరపనుంది.
మరోవైపు అవినీతి నిరోధక చట్టం (సవరణ) 2018లోని 17ఏ సెక్షన్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని మాజీ ఐపీఎస్ నాగేశ్వర రావు వివరించారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఈ సెక్షన్ 17ఏ లోని ఫస్ట్ పార్ట్ ప్రకారం.. పదవి నుంచి దిగిపోయిన లేదా అధికారాల నుంచి వైదొలిగిన వ్యక్తులను అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులు విచారించాలంటే ముందుగా ఆయా విభాగాల అత్యున్నత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. 2018 జులై 26 నుంచి అమల్లోకి వచ్చిన 17ఏ సెక్షన్ ప్రకారం ఆయా విభాగాల అధిపతుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా పోలీసులు ఏం చేయడానికి వీల్లేదు.
ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ ఇదే చట్టం వర్తిస్తుంది. ఆయన పదవిలో ఉండగా స్కామ్ జరిగిందని, ఇప్పుడు పదవి నుంచి దిగిపోయాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలా అరెస్టు చేయాలంటే పోలీసులు ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే. ఇక్కడ 17ఏ సెక్షన్ లోని రెండో పార్ట్.. ఎవరి విషయంలో ఎవరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. మరేదైనా పదవి, అధికారం విషయంలో ఆ వ్యక్తిని తప్పించే అధికారం ఉన్న వాళ్ల అనుమతి తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యమంత్రి విషయంలో ఆ అధికారం గవర్నర్ కు మాత్రమే ఉంది. కాబట్టి చంద్రబాబు అరెస్టు అనే కాదు కనీసం విచారించడానికి కూడా గవర్నర్ అనుమతి తప్పనిసరి. కానీ బాబు విషయంలో సీఐడీ అలా చేయలేదు కాబట్టి ఆయనపై పెట్టిన కేసు అక్రమం. సీఆర్పీసీలోని 482 సెక్షన్ లేదా ఆర్టికల్ 226 ప్రకారం బాబుపై కేసును కొట్టివేసే అవకాశముంది.