న్యాయ వ్యవస్థలు, న్యాయమూర్తులపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేసి ఏకంగా సుప్రీం కోర్టు జడ్జిలపై ఆరోపణలు చేస్తూ లేఖలు రాయడం జాతీయస్థాయిలో పెనుదుమారం రేపింది. దీంతో, కోర్టులు, జడ్జిలను విమర్శించిన వైసీపీ నేతలపై పలు న్యాయస్థానాలు సీరియస్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కోర్టులు, జడ్జిలను సోషల్ మీడియాలో విమర్శించిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 6న సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతకు నోటీసులు రావడంపై చర్చ జరుగుతోంది.
గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు తీసివేయాలని కోర్టు ఆదేశించడం, డాక్టర్ సుధాకర్ కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైసీపీ నేతలు అసహనానికి గురయ్యారు. దీంతో, కోర్టులను, జడ్జిలపై నేరుగానే విమర్శలు గుప్పించారు. న్యాయస్థానానికి, న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. కోర్టులను విమర్శిస్తూ, జడ్జిలపై దూషణలకు దిగుతూ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో వారిపై కొందరు ఫిర్యాదు చేయడంతో…. రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. ఆ వ్యాఖ్యలు చేసిన 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. ఆ 49 మందిలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమంచికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో కోర్టులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.