కొంతకాలంగా సీఎం జగన్ కు, వైసీపీ నేతలకు ఆ పార్టీ రెబల్ ఎంపీ కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరును, జగన్ వైఖరిని ఎండగడుతోన్న రఘురామపై ఏ అవకాశం వచ్చినా కక్ష తీర్చుకునేందుకు వైసీపీ సర్కార్ రెడీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా రుణాల ఎగవేత కేసులో రఘురామతో సహా 16 మందిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. రఘురామ చైర్మన్‌గా ఉన్న ఇండ్ భారత్ కంపెనీ రూ. 974.71 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదని అభియోగాలు రావడంతో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
థర్మల్ విద్యుత్ కేంద్రం పేరుతో 3 రుణ సంస్థల నుంచి సేకరించిన రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. రఘురామకు చెందిన’ఇండ్ భరత్ పవర్ మద్రాస్ సంస్థ’…. పీఎఫ్సీ, ఆర్ఈసీ, ఐఐఎఫ్‌సీఎల్ నేతృత్వంలోని కన్సార్షియం నుంచి సుమారు రూ. 947 కోట్ల 71 లక్షల రుణం తీసుకుందని చార్జిషీట్ లో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ భరత్ సంస్థ థర్మల్ విద్యుత్ కేంద్రం నెలకొల్పకుండా ఆ డబ్బును పలు బ్యాంకులకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో పక్కదారి పట్టించారని విచారణలో తేలిందని సీబీఐ పేర్కొంది. ఆ నిధులను అక్రమంగా వినియోగించడం వల్ల కన్సార్షియం 947 కోట్ల 71 లక్షలు నష్టపోయిందని వివరించింది.
ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలపై రఘురామ స్పందించారు. రేపో, మాపో జైలుకు వెళ్లే వారు చేస్తోన్న వ్యాఖ్యలను తాను పట్టించుకోనని చురకలంటించారు. ఈ చార్జ్‌షీట్ ఇప్పుడే నమోదు కావడం కూడా చాలా శుభపరిణామమని అన్నారు. అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తామని రఘురామ చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో రఘురామ దూకుడుకు సీబీఐ బ్రేక్ వేయనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ ను జగన్ టార్గెట్ చేశారని, అందుకే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిందని చెబుతున్నారు.