2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన 151 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో, ప్రజలు తమకు పట్టం కట్టారని, వైసీపీ ఫ్యాన్ గాలి బాగా వీచిందని వైసీపీ నేతలు టీడీపీని ట్రోల్ చేశారు. అయితే, ఆ మాట నిజమేనని, ప్రమాణ స్వీకారం చేయడం కూడా సరిగా రాని వారంతా ఫ్యాన్ గాలి వీచి ఎమ్మెల్యేలయ్యారని టీడీపీ నేతలు విమర్శించారు.
వైసీపీ తరఫున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం చేయడం కూడా రాదన్న సంగతి అసెంబ్లీ తొలిరోజునే తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే కొందరు వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలుంటున్నాయి. వైసీపీ నేతల నాలెడ్జ్ ను బట్టబయలు చేసే తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ ఉంగుటూరు ఎమ్మెల్యే పుష్పాల వాసుబాబు చేసిన ప్రచారంపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.
వైసీపీ తరపున పోటీ చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులను గెలిపించాలని.. అందుకోసం సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు చెప్పడం కామెడీగా మారింది. ఉంగుటూరు మండలం, గోపీనాథపట్నంలో జడ్పీటీసీ అభ్యర్థిని కొరిపల్లి జయలక్ష్మి, ఎంపీపీ అభ్యర్థిని గంట శ్రీలక్ష్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొన్న వాసు బాబు టంగ్ స్లిప్ కావడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు మీ ముందుకు వచ్చారని, మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి వారిని గెలిపించాలని వాసుబాబు అనడంతో వైసీపీ అభ్యర్థులు అవాక్కయ్యారు. అయితే, వెంటనే తేరుకున్న వాసుబాబు….కామెడీగా అలా చెప్పానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వాసుబాబు తేరుకునే లోపే…ఈ కామెడీ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.