మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్ధ్‌పై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. శంషాబాద్ విమానాశ్రయంలో నిబంధనలకు విరుద్ధంగా సిద్ధార్థ్ బ్యాగ్‌లో బుల్లెట్ దొరకడం కలకలం రేపింది. ఆ బ్యాగును తనిఖీ చేయగా బుల్లెట్ లభించింది. దీంతో, బుల్లెట్ ఉన్న బ్యాగులో విమానం ఎక్కడానికి ప్రయత్నించిన నేపథ్యంలో సిద్ధార్థ్ పై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తన స్నేహితులతొ కలిసి శ్రీనగర్ వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సిద్ధార్థ్ ఇండిగో విమానం ఎక్కే ముందు తన బ్యాగేజ్‌ను కౌంటర్లో అప్పగించారు. బ్యాగ్‌ను స్కాన్ చేసే క్రమంలో అందులో 5.56 ఎంఎం క్యాలిబర్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. దీంతో, విమానాశ్రయ పోలీసులకు బుల్లెట్‌తో పాటు సిద్ధార్థ్‌ను తనిఖీ సిబ్బంది అప్పగించారు. అయితే, తనకు అనంతపురంలో లైసెన్డ్స్ గన్ ఉందని, దానికి సంబంధించిన బుల్లెట్ ఇది అని సిద్ధార్థ్ తెలిపారు.
బ్యాగ్‌లో బుల్లెట్ ఉందన్న విషయం తెలియకే విమానం ఎక్కడానికి ప్రయత్నించినట్లు సిద్ధార్థ్ వివరణ ఇచ్చారు. అయితే, సిద్ధార్థ్ దగ్గర ఆయుధ లైసెన్సుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేవు. దీంతో, ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఆర్పీసీ 41–ఏ కింద సిద్ధార్థ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుపై మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఆయుధ లైసెన్సుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించాలని ఆదేశించి పంపేశారు.