టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి ఆంధ్రా ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా, ముక్కుసూటిగా చెప్పే నైజం జేసీ ప్రభాకర్ రెడ్డి సొంతం. ఈ క్రమంలోనే గతంలో సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ప్రభాకర్ రెడ్డి పలుమార్లు విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ పాలన సరిగా లేదని ఆయన ఎన్నోసార్లు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు.
అకారణంగా టీడీపీ నేతలపై, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాడిపత్రిలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో జేసీతో పాటు మరో 120 మంది జేసీ అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది. తాడిపత్రి పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉందని, అయినా అనుమతి లేకుండా టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
అయితే, టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుకు వ్యతిరేకంగా తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట జేసీ తన అనుచరులతో నిరసనకు దిగారు. వైసీపీ ఆగడాలకు వత్తాసు పలుకుతున్న పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో కూడా పోలీసుల తీరుకు వ్యతిరేకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.