ప్రజలకు సీఎం చంద్రబాబు న్యూ ఈయర్ విషెస్ చెప్పారు. విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించి ఆశీస్సులు తీసుకున్న చంద్రబాబు…ఆ తర్వాత మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, ఉన్నతాధికారులు,కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ పాలనపై చంద్రబాబు ధ్వజమెత్తారు.
వైసీపీ పాలనకు చరమగీతం పాడి ఎన్డీఏ పాలనకు ఆహ్వానం పలికిన 2024 హిస్టారికల్ ఇయర్ అని చంద్రబాబు అన్నారు. 6 నెలల ఎన్డీఏ పాలన ప్రజలకు భరోసానిచ్చిందని చెప్పారు. పాలనలో ముందుకు సాగే కొద్దీ తనకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయని, జగన్ పాలన గురించి అధికారులు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. తవ్వే కొద్దీ లోతు తెలుస్తోందని, అధికారులందరికీ జగన్ చాలా వింత అనుభవాలు చూపించారని ఎద్దేవా చేశారు. అధికారులతో పాటు ప్రజలు, మీడియా కూడా ఇబ్బంది పడ్డారని అన్నారు.
అమరావతికి జగన్ వేసిన చిక్కుముడులను విప్పుతున్నానని, కాస్త సమయం పడుతుందని అన్నారు. త్వరలోనే పోలవరాన్ని కూడా పరుగులు పెట్టిస్తానని చెప్పారు. హైదరాబాద్ సినిమా హబ్ అని, తెలుగు సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ పెరిగిందని చెప్పారు. అయితే, ప్రస్తుతం దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద చేయాలని, ఇప్పుడు సినిమా గురించి అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు..
వైసీపీ నేతలు చాలామంది టీడీపీ, జనసేన, బీజేపీలలో చేరుతున్నారని, ఆ చేరికలపై చర్చిస్తామని తెలిపారు. అయితే, అందరికీ పదవులు ఇవ్వలేం కదా అని చంద్రబాబు ప్రాక్టికల్ గా మాట్లాడారు. తాను గతంలో లాగా లేనని, అన్ని విషయాలు చూసుకుంటున్నానని, తనకో మెకానిజం ఉందని అన్నారు.