ఈ నెల 11న విశాఖలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రా యూనివర్సిటీలోని గ్రౌండ్లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన అధికారిక కార్యక్రమాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారా లేదా అన్న వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ టూర్ సందర్భంగా మోడీతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే తాగాగా ఆ ప్రచారానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో, మోడీతో పవన్ భేటీ అధికారికమైంది. శుక్రవారం సాయంత్రం నుంచి విశాఖలో అందుబాటులో ఉండాలంటూ పవన్ కు పీఎంఓ నుంచి ఫోన్ రావడం హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం రాత్రి లేదంటే శనివారం ఉదయం మోడీతో పవన్ భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి బిజెపి కోర్ కమిటీ సమావేశంలో ప్రధాని బిజీగా ఉండబోతున్నారు.
దీంతో, దాదాపుగా శనివారం ఉదయం మోడీతో పవన్ భేటీ అయి పలు విషయాలపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల విశాఖలో తన పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలు, రాష్ట్రంలోని పలు వ్యవహారాలు, బిజెపిలో కొందరు నేతల తీరుపై ప్రధానితో పవన్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా విశాఖకు పవన్ చేరుకోనున్నారు.
ఈ ప్రకారం విశాఖ శ్రేణులకు జనసేన నేతలు సమాచారం కూడా పంపినట్టు తెలుస్తోంది. అయితే, ప్రధాని పర్యటన సందర్భంగా జరగబోయే అధికారిక కార్యక్రమాలకు సీఎం జగన్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ, జగన్ పాల్గొనే కార్యక్రమాల్లో పవన్ ఉంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.