తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఈ రోజుకు సభ ముందు కాగ్ రిపోర్టును సమర్పించారు. ప్రభుత్వ తప్పుల్ని తూర్పార పట్టే నివేదికలో.. ఘాటైన వ్యాఖ్యలు పెద్దగా లేకున్నా.. పలు లోపాల్ని ఎత్తి చూపారు. రానున్న ఏడేళ్ల వ్యవధిలో తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు లెక్కల్ని పేర్కొన్నారు. తెలంగాణలో ద్రవ్య లోటు.. చెల్లించాల్సిన రుణ బాధ్యతలన్ని 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితులకు లోబడే ఉన్నట్లుగా కాగ్ పేర్కొంది.
ఈ నివేదికలోని అంశాల్ని చూస్తే..
– ప్రాథమిక లోటులో తగ్గుదల ఉన్నా.. ప్రాథమిక వ్యయాన్ని భరించే స్థాయిలో అప్పులు మినహా రాబడి లేదు
– బడ్జెట్ అంచనాలకు.. వాస్తవాలకు మధ్యయ తేడా తగ్గేలా బడ్జెట్ తయారీ ప్రక్రియను హేతుబద్ధీకరించాలి
– వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. విద్య..రవాణా.. క్రీడలు..కళలకు ఖర్చు తగ్గిస్తోంది.
– సాగునీటి ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్నా.. వాటి ఆర్థిక ఫలితాల్ని ప్రభుత్వం వెల్లడించటం లేదు.
– రెవెన్యూ రాబడి.. ఖర్చుల పెరుగుదల 2015-16 నుంచి 2018-19 మధ్య కాలంలో మెరుగైంది
– జీఎస్టీలో రాబడి.. ఖర్చులు స్వల్పంగా తగ్గాయి
– అంతకు ముందు గణాంకాలతో పోలిస్తే.. జీఎస్టీడీపీతో పోల్చినా క్యాపిటల్ వ్యయం తగ్గింది
– 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 3.25 శాతం కంటే ద్రవ్యలోటు జీఎస్డీపీలో తక్కువగానే ఉంది.
– చెల్లించాల్సిన రుణ బాధ్యత జీఎస్డీపీతో పోలిస్తే 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 23.33 శాతం కంటే తక్కువగా 22.75 శాతం ఉన్నాయి
– 2019 మార్చి లెక్కల ప్రకారం ప్రభుత్వ అప్పుల్లో 46 శాతం అంటే.. రూ.76,262 కోట్లు రానున్న ఏడేళ్లలో తీర్చాల్సి ఉంది.
– 2014-18 మధ్య కాలంలో రూ.55,5`17 కోట్లను శాసన సభ ఆమోదం లేకుండా అధికంగా ఖర్చు చేసింది. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
– 2018-19 బడ్జెట్లో తప్పుడు వర్గీకరణ తో రెవిన్యూ మిగులును చూపారు. రూ.4337 కోట్ల రెవెన్యూ మిగులు అవాస్తవం.
– రూ.5114 కోట్ల రెవెన్యూ లోటు ఉందని మా పరిశీలనలో తేలింది. వడ్డీల భారం అధికంగా ఉంది.
– సగటున 6.93 శాతం వడ్డింపులు చెల్లిస్తున్నారు. వడ్డీ చెల్లింపుల్లో 16 శాతం పెరుగుదల ఉంది. రెవెన్యూ రాబడితో పోలిస్తే 12.41 శాతంగా వడ్డీ చెల్లింపులున్నాయి. 14 ఆర్ధిక సంఘం ప్రకారం 8.37 శాతం మించకూడదు.
– సాగునీటి ప్రాజెక్ట్స్ ఆలస్యంతో రూ.87 వేల కోట్ల మేర అంచనాలు పెరిగాయి.
– హైదరాబాద్లో ప్రతి వ్యక్తికి రోజుకు 150 లీటర్ల ఇస్తున్నామఅన్నారు…కానీ 70 లీటర్ల కు మించి ఇవ్వడం లేదు.
– దేవాలయ భూముల్లో 23 శాతం ఆక్రమణలో ఉన్నాయి. దేవాలయ భూముల పరిరక్షణ కోసం సరైన యంత్రంగం లేదు
– 20, 124 ఎకరాల భూమి కబ్జా అయితే 3488 ఏకరాలపై మాత్రమే కేసులు వేశారు. కబ్జా అయిన దానిలో ఇది కేవలం 17.33 శాతం భూమి మాత్రమే. ఆడిట్ చేసిన 24 మండలాల్లో 1096 కోట్ల విలువగల 12,666 ఎకరాలు కబ్జా అయ్యింది.