బుద్ధా వెంకన్న. పొలిటికల్ బుద్ధుడిగా పేరున్న నాయకుడు. చంద్రబాబు చెప్పింది పాటించడం తప్ప.. ఆయన ఏమీ చేయరు. కానీ, ఇప్పుడు సొంత పార్టీలోనే లిటిగేషన్ బుద్ధావతారం ఎత్తారట. విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. గతంలో ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. అది కాస్తా అయిపోయింది. పార్టీ అధికారంలో లేక పోవడంతో బుద్దా వెంకన్న గత మూడేళ్లుగా ఖాళీగా ఉన్నారు. అయినప్పటికీ.. పార్టీ కోసం గళం వినిపించారు.
అప్పటి సీఎం జగన్, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారికి బహిరంగంగానే ఆయన వార్నింగులు ఇచ్చారు. ఇక, ఎన్నికలకు ముందు బుద్ధా చేసిన రక్త తర్పణం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. విజయవాడ వెస్ట్ కానీ.. అనకాపల్లి ఎంపీ సీటును కానీ.. తనకు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే.. చంద్ర బాబు మాత్రం ఆయనకు ఏదీ ఇవ్వలేక పోయారు. దీంతో ఇప్పుడు సర్కారు ఏర్పడిన తర్వాత.. కనీసం నామినేడెట్ పదవి అయినా దక్కుతుందని అనుకున్నారు. అది కూడా దక్కలేదు. దీంతో పొలిటికల్ బుద్ధుడు ఇప్పుడు లిటిగేషన్ బుద్ధావతారం ఎత్తారు!
తనకు ఎలాంటి పదవి లేక పోవడంతో ఏ పనినీ చేయలేకపోతున్నానని..తన మాటను ఎవరూ వినిపించు కోవడం లేదని బుద్ధా కొన్నాళ్ల కిందట బహిరంగ వేదికగానే చెప్పారు. తద్వారా ఆయన తన మనసులోని మాటను బయట పెట్టారు. ఇంకా ఎన్నాళ్లు వేచి ఉండాలని కూడా అసహనం వ్యక్తం చేశారు. దీనిని అంత తేలికగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. బుద్ధా బాధ.. కొన్నాళ్ల కిందటే బయట పడినా.. ఇప్పుడు ఆయన పార్టీలోనే ముసలం పుట్టించే పనులు చేస్తున్నారని అంటున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తమ్ముళ్లతో గ్రూపులు కట్టించి.. తమకు ఏమాత్రం ఇష్టం లేని వారితో కూడా కలిసి పని చేసేలా చేస్తున్నారట. బుద్ధావర్గంగా పేరున్న అలాంటి వారంతా మౌనంగా ఆయన చెప్పింది చేస్తున్నారు. ఎవరూ బయట పడేందుకు సాహసించడం లేదు. బుద్ధా తాజా నిర్ణయంతో వైసీపీ నుంచి బయటకు వచ్చే వారికి కూడా బ్రేకులు పడుతున్నాయి.
“ఇక్కడేమీ లేదు. అంతా బుసే“ అంటూ.. అంతర్గత చర్చల్లో బుద్దా అనుచరులు చెబుతున్నారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీంతో పార్టీ పరంగా ఎలా ఉన్నా.. బయట నుంచి వచ్చేవారికి మాత్రం ఆయన బ్రేకులు వేస్తూ.. పుంజుకోనీయకుండా అడ్డు పడుతున్నారనది టాక్. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.