ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఛాలెంజ్ విసిరారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు పై బుద్ధా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగిందని.. అప్పుడు తప్పులు చేసి, ఇప్పుడు ఆ తప్పులు బయటకు వస్తాయనే భయంతో ఫైళ్లను తగులబెడుతున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నవారంతా దండుపాళ్యం బ్యాచ్ అని బుద్ధా ఎద్దేవ చేశారు. తాను జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నాను..దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి జగన్ గానీ, జగన్ బ్యాచ్ గానీ మేము పలానా శాఖలో దుచుకోలేదు అని చెప్పగలరా..? అంటూ బుద్ధా సవాల్ విసిరారు. ఆడుదాం ఆంధ్రా అంటూ రోజా నీతులు చెప్పింది. అగ్రిగోల్డ్ భూములను జోగి రమేష్ తనయుడు దోచేశాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ పాలనలో అన్నీ అక్రమాలు, అరాచకాలే జరిగాయని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు.
5 ఏళ్లుగా వైసీపీ నేతలు, కొందరు అధికారులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారని.. ఒక్క పరిశ్రమ రాకుండా రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ శాఖల్లో కీలక దస్త్రాలు దగ్ధమవ్వడం విచిత్రంగా ఉందని.. ఇది మొత్తం జగన్ ఆర్ట్ అని బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.