మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తును వేరే రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఆయన చిన్నాన్న మర్డర్ మిస్టరీ వీడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసును పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని సాక్షాత్తూ వివేకా తనయురాలే సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం సంచలనం రేపుతోంది. ఇక, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని జగన్ సొంత సోదరి షర్మిల స్వాగతించడంతో జగన్ కు డబుల్ షాక్ తగిలినట్లయింది.
ఈ నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు. షర్మిల వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తులసిరెడ్డి చెప్పారు. వివేకా కేసులో జగన్ బాధితుల వైపు కాకుండా నిందితుల వైపు నిలబడ్డారని ఆయన ఆరోపించారు. జగన్ పాలన ఔరంగజేబు పాలనను గుర్తు చేస్తోందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఇంతటి క్రూరమైన పాలన ఉండకూడదని చెప్పారు.
వివేకా కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం సబబేనని షర్మిల అనడం స్వాగతించదగ్గ పరిణామమని టీడీపీ నేత బీటెక్ రవి చెప్పారు. ఈ కేసులో సాక్ష్యులను బెదిరిస్తున్నారనే విషయం షర్మిలకు తెలుసని ఆయన అన్నారు. ఈ కేసు విచారణ అధికారులపై కూడా కేసులు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హంతకులు సెంట్రల్ జైలు నుంచి స్వేచ్ఛగా బయటకు వస్తున్నారని ఆరోపించారు.
కడప ఎంపీ సీటు విషయంలో వివేకా అడ్డు తగలడంతోనే ఆయనను హత్య చేశారని రవి ఆరోపించారు. వివేకా హత్య జరిగిన వెంటనే లోటస్ పాండ్ లో ఉన్న జగన్ కు అన్ని వివరాలు తెలిసిపోయాయని ఆరోపించారు. హంతకులకు కొమ్ముకాస్తున్న జగన్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు.