మాజీ మంత్రి వివేకా మర్డర్ మిస్టరీ సినిమా థ్రిల్లర్ కు మించిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ తుది దశకు చేరిందనుకుంటున్న తరుణంలో మరిన్ని మలుపులు తిరగడం సంచలనం రేపుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డిని మూడు సార్లు సీబీఐ అధికారులు విచారణ జరపడం, ఆ తర్వాత ఆయన అరెస్ట్ ఖాయం అనుకుంటున్న సమయంలో తాజాగా మరో కొత్త వాదనను తెరపైకి తేవడం షాకింగ్ గా మారింది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని, అందుకే వివేకాను హత్య చేశారని వైఎస్ భాస్కరరెడ్డి తరపు న్యాయవాది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. వివేకాను క్రూరంగా హత్య చేసిన రక్త పిశాచాలు ఇప్పుడు ఆయన వ్యక్తిత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసులో జగన్ రెడ్డి గ్యాంగ్ నాలుక మడతేసినట్టు, మాట మార్చినట్లు మరెవరూ చేసి ఉండరని, ఒలింపిక్స్లో నాలుక మడత పోటీలు పెడితే గోల్డ్ మెడల్స్ అన్నీ జగన్ రెడ్డి ముఠాకే దక్కుతాయని సెటైర్లు వేశారు. గుండెపోటుతో మొదలైన నాలుక మడత డ్రామా నాలుగేళ్లుగా ఎన్నో అబద్ధాల చుట్టూ తిరుగుతోందని మండిపడ్డారు. గుండెపోటు, టీడీపీ నేతలే హత్య చేశారని ఆరోపణలు, ‘నారాసుర చరిత్ర’, వివేకాను అల్లుడే హత్య చేశాడని ఆరోపణలు..ఆస్తి తగాదాలు… అక్రమ సంబంధం…చివరకు లైంగిక వేధింపుల వరకు చేరిందని అన్నారు.
ప్రతిపక్షంలో వివేకా కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరమన్న జగన్…అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారని అన్నారు. వివేకా కుమార్తె పోరాటంతో సీబీఐ దర్యాప్తు జరుగుతోందని, ఆమెపై కూడా నిందలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.